Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రికి ఫ్లైట్లో హార్రర్ షో

By:  Tupaki Desk   |   21 May 2016 6:23 AM GMT
ఏపీ మంత్రికి ఫ్లైట్లో హార్రర్ షో
X
నిన్న ఈదురుగాలులు.. వానతో హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలుల దెబ్బకు భారీగా ఆస్తినష్టం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు.. స్తంభాలు నేల కూలాయి. ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఐతే ఈ గాలుల దెబ్బకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ఫ్లైట్లో హార్రర్ షో కనిపించిందట. ఈ ఫ్లైట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత కూడా ఉండటం గమనార్హం. ఆమెతో పాటు అందరూ ఓ అరగంట పాటు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం సాగించారట. చావుకు దగ్గరగా వెళ్లొచ్చామని.. అసలు ప్రాణాలతో కిందికి దిగుతామని అసలు అనుకోలేదని మంత్రి అన్నారు.

శుక్రవారం సాయంత్రం తీవ్రమైన గాలులు వచ్చిన సమయంలో స్పైస్ జైట్ లో మంత్రితో పాటు కొందరు ప్రయాణికులు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఐతే గాలులకు విమానం ఊగిపోవడంతో అందరూ వణికి పోయారు. చాలామంది ప్రాణభయంతో కేకలు వేశారు. విమానంలో కుదుపులు.. పెద్ద శబ్దాలు రావడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. విమానం కూలిపోతుందేమో అని వణికిపోయారు. ఐతే తర్వాత కొద్ది సేపటికి గాలుల తీవ్రత తగ్గడంతో విమానం సురక్షితంగా విజయవాడలో ల్యాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీని గురించి సుజాత మాట్లాడుతూ.. విమానం ఊగిన తీరు చూస్తే తమ ప్రాణాలు దక్కుతాయని అనుకోలేదన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్.. ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి కూడా ఉన్నారు. చింతమనేని మాట్లాడుతూ.. కుదుపుల వల్ల తన తల విమానం పైభాగానికి తాకిందన్నారు. ఇంత గాలి వీస్తున్నప్పుడు విమానం బయల్దేరకుండా ఉండాల్సిందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విమానం బయల్దేరే ముందు పరిస్థితి పర్వాలేదన్నట్లే ఉంది. ఐతే తర్వాత గాలుల దెబ్బకు శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు.