Begin typing your search above and press return to search.

మాగంటి - చింతమనేనికి చెక్.. మళ్లీ ఫామ్ లోకి సుజాత

By:  Tupaki Desk   |   12 Feb 2020 9:15 AM GMT
మాగంటి - చింతమనేనికి చెక్.. మళ్లీ ఫామ్ లోకి సుజాత
X
టీచర్ వృత్తిని నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ఉన్నారు. పార్టీలో ఆమె పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో ఒకప్పుడు ఆమె చక్రం తిప్పారు. మంత్రిగా కీలకమైన రెండు శాఖలను మోసి పని చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2019 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె భవిష్యత్ ఏమిటో తెలియడం లేదు. తన నియోజకవర్గంలో ఇతర వర్గాలతో సతమతమవుతున్నారు. మరీ ఇలాంటి పరిస్థితిలో ఆమె చింతలపూడి పై పట్టు ఎలా కాపాడుకుంటారో చూడాలి.

అచంట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఆ తర్వాత 2014లో చింతలపూడి నుంచి గెలుపొందారు. అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఆమె ఇప్పుడు తెలుగుదేశంలో సొంత కార్యకర్తల నుంచే నియోజకవర్గంలో ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. మాగంటి బాబు - చింతమనేని అనుచరులు నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆ రెండు వర్గాలకు చెక్‌ పెడుతూ తన వర్గం నేతలకు ప్రాధాన్యం ఉండేలా సుజాత తీవ్ర కష్టాలు పడుతున్నారు.

చింతలపూడి మార్కెట్‌ యార్డు వివాదం మాగంటి బాబు వర్గానికి - పీతల వర్గానికి ప్రతిష్టాత్మకంగా మారింది. చివరి ఏడాదిలో మాగంటి వర్గం మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవి దక్కించుకోవడంతో పాటు పీతల సుజాతకు వ్యతిరేకంగా పని చేశారు. ఆ సమయంలో ఆమె మంత్రి పదవిపోయింది. ఈ నేపథ్యంలో పీతల సుజాతకు 2019లో చింతలపూడి టికెట్‌ దక్కలేదు. దీంతో ఆమె వర్గం చెల్లాచెదురైంది. సుజాత వర్గం కొంతమంది సైలెంట్‌ ఉంటే మరి కొంతమంది వైఎస్సార్సీపీలో చేరారు.

ఇప్పుడు ఆమెకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మాత్రమే కొంత బలం ఉంది. ఆ ప్రాంతంలోని కార్యకర్తలను పీతల సుజాత కలుస్తున్నారు. తన స్వగ్రామం వీరవాసరంలో ఉంటున్నారు. 2019లో చింతలపూడి టికెట్‌ కర్రా రాజారావుకు ఇచ్చారు. ఆయన వయసు రీత్యా ఇప్పుడు నియోజకవర్గంలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పీతల సుజాత మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహిస్తూ చర్చిస్తున్నారు. ఈసారి చింతలపూడి పార్టీ బాధ్యతలను తాను తీసుకునేలా సుజాత ప్లాన్ వేస్తున్నారు.

అయితే ఈ నియోజకవర్గంపై కన్నేసిన మాగంటి బాబు - చింతమనేని వర్గాలను ఎలా ఎదుర్కొంటారు? సుజాతకు వారు మద్దతుగా నిలుస్తారా? లేదా అనేది భవిష్యత్ లో తెలియనున్నాయి. ఓటమి తర్వాత చతికిల పడిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏ మేరకు నింపుతారో వేచి చూడాలి.