Begin typing your search above and press return to search.

పెగాసస్ స్పైవేర్ స్కాం .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Aug 2021 9:52 AM GMT
పెగాసస్ స్పైవేర్ స్కాం .. సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు ప్రపంచంలో, మన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పెగాసస్ స్త్పైవేర్ వల్ల పలు దేశాల్లో అస్థిర పరిస్థితులు ఏర్పడి రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యవహారం పై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోయిన ప్రతిపక్షాలు మాత్రం పట్టువీడడం లేదు. దీని పై కేంద్ర ప్రభుత్వం తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఇజ్రాయిల్ ఎన్ ఎస్ వో సృష్టించిన ఈ స్త్పైవేర్‌ బారిన పడ్డారు చాలా మంది ప్రముఖులు. పెగాసస్‌ వ్యవహారం పై సుప్రీంకోర్టులో గురువారం ప్రారంభమైంది.

పెగాసస్ స్పైవేర్ స్కాంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 9 పిటిషన్లను గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ ఎన్‌ వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌ లతో కూడి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు, రాజ్యాంగ అధికారులు, జర్నలిస్టులు, జడ్జిలు, హక్కుల నేతలే టార్గెట్‌గా చేసిన ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయకపోవడాన్ని పిటిషన్ల తరపు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కబిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. స్పైవేర్‌ ను కొనుగోలు చేసింది ఎవరు, హార్డ్‌ వేర్ ఎక్కడ ఉంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగకరమని సిబల్‌ వాదించారు.

ఈవ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని అన్నారు. మరోవైపు ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ గురించి మీడియా నివేదిక నిజమైతే, ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ తమ వాదనలకు అనుకూలమైన మెటీరియల్‌ ని అందించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులై వుండీ వివరాలు సేకరించడానికి అంతగా ప్రయత్నించలేదన్నారు. అలాగే దీనివల్ల తాము ప్రభావితమయ్యామని చెప్పుకుంటున్న వారు, ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

కాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ ఎంపీ, న్యాయవాది పెగాసస్‌ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు పిటిషన్లను దాఖలు చేశారు. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, న్యాయవాది ఎంఎల్ శర్మ ఇందులో ఉన్నారు. దాదాపు 300 మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఈ వ్యవహరాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎడిటర్స్ గిల్డ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పెగాసస్ వివాదం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది.

ఈ స్త్పైవేర్‌ మన ఫోన్లలోని డేటాను మనకి తెలియకుండానే చోరీ చేస్తోంది. దీన్ని గుర్తించేందుకు, మన ఫోన్లపై నిఘా ఉంచిందా లేదా అన్నది కొన్ని యాప్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. IMazing అనే ఈ యాప్ మ్యాక్ ఓఎస్, విండోస్ రెండింటికీ పనిచేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించిన ఐఫోన్ ద్వారా మ్యాక్ ఓఎస్, విండోస్‌కు కనెక్ట్ కావడం ద్వారా మన ఫోన్ స్త్పైవేర్‌ బారినపడిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఐఫోన్‌ లో స్త్పైవేర్ గుర్తించేందుకు మ్యాక్ ఓఎస్, విండోస్‌లలో iMazing 2.14 వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. ఐఫోన్‌ ను మ్యాక్ ఓఎస్, విండోస్‌‌ కు కనెక్ట్ చేసి డిటెక్ట్ స్ల్పై‌వేర్ ఆప్షన్‌ ను ఎంపిక చేయడం ద్వారా మనం ఫోన్‌ పై నిఘా ఉందా, లేదా అన్న విషయనాన్ని తెలుసుకోవచ్చు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కుల సంఘం ఇది వరకే మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్‌ ను విడుదల చేసినా ఫ్రెండ్లీ యూస్ కోసం ఈ కొత్త యాప్‌ను విడుదల చేశారు.