Begin typing your search above and press return to search.

చలానాలు ఉంటే బరాబర్ బండిని సీజ్ చేయొచ్చు

By:  Tupaki Desk   |   23 Aug 2021 3:46 AM GMT
చలానాలు ఉంటే బరాబర్ బండిని సీజ్ చేయొచ్చు
X
గడిచిన రెండు..మూడు రోజులుగా ఒక పోస్టు వైరల్ అవుతోంది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాన్ని పోలీసులు సీజ్ చేసే అధికారం లేదని.. ఒక యువ న్యాయవాది విషయంలో సైబరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పడుతూ పోస్టు ఒకటి వైరల్ గా మారింది. ఇదే పోస్టులో అసలు పోలీసులకు వాహనాల్ని సీజ్ చేసే అధికారం లేదన్న మాట అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లుగా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాల్ని సీజ్ చేసే అవకాశం లేదా? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తాజాగా ఒక వివరణ ఇచ్చారు. అదే సమయంలో.. యువన్యాయవాది పేరుతో సర్క్యులేట్ అయిన మెసేజ్ పై సదరు న్యాయవాది కూడా స్పందించి.. తన పేరుతో తప్పుగా సర్య్కులేట్ అవుతున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

చలానాలు చెల్లించకుంటే వాహనాల్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా వైరల్ అవుతున్న పోషల్ మీడియా పోస్టు తప్పుగా తేల్చారు. బరాబర్ సీజ్ చేసే అధికారం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. రూల్ బుక్ లో ఏ సెక్షన్ కింద ఈ పని చేయొచ్చో కూడా తేల్చి చెప్పారు. కేంద్ర మోటారు వాహన నిబంధనల్లోని 167వ రూల్ ఇదే విషయాన్ని చెబుతుందని.. నిబంధనల్ని ఉల్లంఘించే వారి వాహనాల్ని సీజ్ చేసే అధికారంతమకు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

ఒక వాహనంపై చలానాలు 90 రోజులకు మించి పెండింగ్ లో ఉంటే.. వాటిపై వాహనదారుడు స్పందించకుంటే.. అలాంటి వాహనాల్ని సీజ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎప్పటికప్పుడు తమ చలానాల్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు. తప్పుడు చలానాలు ఉంటే వాటిని ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందని.. వెంటనే వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

హైకోర్టు ఏం చెప్పిందన్న విషయంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏమని చెప్పారంటే.. ‘‘ఓ న్యాయవాది తన వాహనాల చలానాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీజ్‌ చేసిన సదరు అడ్వొకేట్‌ వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ రెండు వారాల్లో పోలీసులకు లేఖ రాయాలని కోర్టు సూచించింది. పోలీసులు దాన్ని పరిశీలించి, 8 వారాల్లోపు వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది’’ అని పేర్కొన్నారు.

హైకోర్టు సూచనలు ఎలా ఉన్నా.. నిజానికి సదరు లాయర్ ఈ నెల 19న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుల ముందు హాజరై.. పెండింగ్ చలాన్లను చెల్లించి వాహనాన్ని విడిపించుకున్న విషయాన్ని చెప్పారు. పిటిషనర్ వాస్తవాన్ని దాచి హైకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరించి చూపటంలో అతని ఉద్దేశమేమిటో అర్థం కావట్లేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. తప్పుడు వార్తనుసోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు సదరు లాయర్ పై చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. సదరు లాయర్ కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు.

తాను హైకోర్టును ఆశ్రయించిన విషయం నిజమేనని.. హైకోర్టు ఆ పిటిసన్ ను ఆగస్టు 11న డిస్పోజ్ చేసిందన్నారు. కాంటెస్ట్ చేయటం ఇష్టం లేక.. ఈ నెల 19న చలానాలు చెల్లించి.. తన వాహనాన్ని విడిపించుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా పోస్టులకు తాను బాధ్యుడ్ని కాదని సదరు లాయర్ నిఖిలేశ్ చెబుతున్నారు. మరి.. దీనికి సైబరాబాద్ పోలీసులు ఏం చెబుతారో చూడాలి.