Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా విలయతాండవం ...రక్షణశాఖ సంచలనం నిర్ణయం !

By:  Tupaki Desk   |   28 April 2020 2:30 PM GMT
అమెరికాలో కరోనా విలయతాండవం ...రక్షణశాఖ సంచలనం నిర్ణయం !
X
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న సమయంలో .. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యుఎఫ్ఓ) లకు సంబంధించిన మూడు వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఇన్నేళ్లుగా యుఎఫ్ ఓ లకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా పెద్దగా పట్టించుకోలేదు పెంటగాన్. అయితే, కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పెంటగాన్ అధికారులు ఉన్నట్టుండి ఇప్పుడు మూడు వీడియోలను విడుదల చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

మొత్తం మూడు వీడియోలను అధికారికంగా విడుదల చేశారు పెంటగాన్ అధికారులు. 2004 నవంబర్‌లో ఒకటి, 2015 జనవరిలో రెండు వేర్వేరు సందర్భాలు చిత్రీకరించిన మూడు వీడియోలనూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అమెరికా వైమానిక దళ జవాన్లు యథాలాపంగా చిత్రీకరించారు ఈ యూఎఫ్ ఓ లను. సముద్ర జలాల్లో పహారా కాస్తున్న సమయంలో ఆకాశాంలో కనిపించిన వింత ప్రకాశాన్ని చిత్రీకరించిన సమయంలో ఈ యూఎఫ్ ఓ లు రికార్డు అయ్యాయి. అత్యాధునికమైన కెమెరాలతో వాటిని చిత్రీకరించారు జవాన్లు.

యుఎఫ్ ఓ కదలికలు ఇందులో స్పష్టంగా నమోదు అయ్యాయి. 2004లో సదరన్ కాలిఫోర్నియాలో సమీపంలో గగనతలంలో మొట్టమొదటి వీడియోను తీశారు. ఇందులో యుఎఫ్ ఓ కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి.2015 జనవరిలో అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఎఫ్-18 యుద్ధ విమానం ద్వారా జవాన్లు గస్తీలో ఉన్న సమయంలో ఈ యుఎఫ్ఓ కనిపించింది. అదేనెలలోనే రెండోసారి కూడా యుఎఫ్ ఓ కనిపించడంతో దాన్ని రికార్డు చేశారు. ఫ్లయింగ్ సాసర్ రూపంలో ఉన్న వస్తువు గాల్లో శరవేగంగా దూసుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా నమోదైంది.

ఈ వీడియోల పట్ల అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఏనాడు పెద్దగా శ్రద్ధ చూపించలేదు. చూసీ చూడనట్లుగానే వ్యవహరించింది. 2019 కన్సాస్ సిటీ సమీపంలో ఆకాశంలో మరోసారి ఇలాంటి వస్తువే కనిపించిన సమయంలో కూడా దాని మీద పెద్దగా దృష్టి సారించలేదు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పెంటగాన్ అధికారులు ఈ మూడింటినీ ఒకేసారి విడుదల చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.