Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై ఢిల్లీ కోర్టులో జ‌న‌సేన పిటిష‌న్‌..

By:  Tupaki Desk   |   9 Oct 2019 11:06 AM GMT
పోల‌వ‌రంపై ఢిల్లీ కోర్టులో జ‌న‌సేన పిటిష‌న్‌..
X
పోల‌వ‌రం ప్రాజెక్టును వివాదాలు వీడ‌టం లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఏ మూహూర్తాన ప్రారంభించారో కానీ దానికి ప‌ట్టిన గ్ర‌హణం వద‌ల‌డం లేదు. ఏపీ తెలంగాణగా విడిపోయిన త‌రువాత పోల‌వ‌రంను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టింది. దీంతో ఏపీకి వ‌రంగా మారిన పోల‌వ‌రంకు రాజ‌కీయ చీడ ప‌ట్టుకుంది. దీంతో పోల‌వ‌రం ఎప్పుడు వివాదాల న‌డుమ‌నే ముందుకు సాగుతుంది. వివాదాల‌ను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోతుండ‌గా ఇప్పుడు జ‌న‌సేన నేతృత్వంలో ఢిల్లీ కోర్టుకు పోల‌వ‌రం వివాదం చేరింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జ‌రిగింద‌ని పేర్కోంటూ జ‌న‌సేన పార్టీ కోర్టుకు పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంత‌కు పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న మరో మలుపు ఏంటి ? ఈ పిటీష‌న్ ఎవ‌రు వేశారు ?

జ‌న‌సేన ఏపీలో కాకుండా ఢిల్లీలో హైకోర్టులోనే ఎందుకు పిటిష‌న్ దాఖాలు చేశార‌న్న‌ది ప‌రిశీలిస్తే... జ‌న‌సేన కీల‌క నేత పెంట‌పాటి పుల్లారావు. పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌ ను విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. ఈ పిటిషన్‌ నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

తాము పోల‌వ‌రంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టుకు తెలిపారు పుల్లారావు. ప్రాజెక్టు వ్యయం మొదటిగా రూ.16 వేల కోట్లు ఉండగా దాన్ని రూ. 58 వేల కోట్లకు పెంచారని ఇందులో భారీగా అవినీతి - అక్రమాలు జరిగాయని పిటిషన్‌ లో పేర్కొన్నారు పుల్లారావు. ఈ పిటిష‌న్ వేయ‌డంపై ఏపీలో ఇప్పుడు భారీ రాజ‌కీయ చ‌ర్చ జ‌రుగుతుంది. జ‌న‌సేన పార్టీ పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని పిటిష‌న్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రంను పూర్తి చేసేందుకు సిద్ద‌మైన త‌రుణంలో దాన్ని రాష్ట్రంకు అప్ప‌గించాల‌ని అప్ప‌టి టీడీపీ స‌ర్కారు - సీఎం చంద్ర‌బాబు కేంద్రాన్ని కోర‌డంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ను ఏపీకి అప్ప‌గించింది కేంద్రం.

అయితే పోల‌వ‌రం నిర్మాణంలో నిర్ల‌క్ష్యం - అవినీతి చోటు చేసుకుంద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు రాజ్య‌స‌భ‌లోనూ - పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోనూ అనేక‌సార్లు చ‌ర్చిండంతో పాటు దీనిపై నిర‌స‌న తెలిపారు. కాని బీజేపీ స‌ర్కారు స్పందించ‌లేదు. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డం - జ‌గ‌న్ సీఎం కావడంతో పోల‌వ‌రంలో జ‌రిగిన అవినీతిపై స్పందించారు. వెంట‌నే రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో గ‌త టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ జ‌రుప‌డంతో దాదాపుగా రూ.800 కోట్లు త‌క్కువ‌కే టెండ‌ర్లు ఖరారు అయ్యాయి. అయితే ఇప్పుడు రివ‌ర్స్ టెండ‌రింగ్ పూర్త‌యి వ‌చ్చె నెల‌ల‌లో ప‌నులు ప్రారంభ‌మ‌య్యే ద‌శ‌లో ఢిల్లీ హైకోర్టులో జ‌న‌సేన పిటిష‌న్ వేయ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతుంది. ఇంత‌కు ఈ పిటిష‌న్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశం మేర‌కు వేశారా ? లేక పెంట‌పాటి పుల్లారావు వ్య‌క్తిగ‌తం వేశారా తెలియాల్సి ఉంది.