Begin typing your search above and press return to search.

ఏం పాపం చేశామ‌ని ఈ బాదుడు మోడీ?

By:  Tupaki Desk   |   22 May 2017 8:32 AM GMT
ఏం పాపం చేశామ‌ని ఈ బాదుడు మోడీ?
X
ఊరించి.. ఊరించి మ‌రీ తీసుకొస్తున్న జీఎస్టీ ప‌న్నుల మీద దేశ ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు ఎన్నో. తాజా ప‌న్నుల విధానంతో అడ్డ‌గోలు బాదుడుకు చెక్ చెప్పి.. దేశ మొత్తమ్మీదా ఒకే ప‌న్ను విధానాన్ని అమ‌లు చేస్తార‌న్న ఆశ‌లు కొంద‌రు పెట్టుకుంటే.. ఇదంతా ఉత్త ప్ర‌చార‌మే త‌ప్పించి.. మ‌రేమీ లేదంటూ విమ‌ర్శించే వారూ ఉన్నారు. తాజాగా వివిధ వ‌స్తుసేవ‌ల్ని ఏయే ప‌న్ను శ్లాబుల్లో ఉంటాయ‌న్న విష‌యం మీద ప్రాథ‌మిక స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చిన వేళ‌.. మెజార్టీ జ‌నులు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.

పైపైన చూసిన‌ప్పుడు మార్పులు చేసిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ.. అవేమీ స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి మీద భారం మోప‌కుండా ఉండ‌వ‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లుగా చెప్పాలి. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌స్తే.. పన్ను విధానంలో మార్పు వ‌స్తుంద‌ని.. గ‌త పాల‌కుల‌కు భిన్న‌మైన విధానాలు అమ‌లు చేసే ఛాన్స్ ఉంద‌న్న ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగింది. జీఎస్టీ మీద తాజా క‌స‌ర‌త్తు చూస్తే.. కొత్త సీసాలో పాత సారా అన్న‌ట్లుగా ఉందే త‌ప్పించి విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులేమీ లేవ‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ప‌న్నుల విదానంలో గ‌రిష్ఠ బాదుడుకు చెల్లుచీటి ఇచ్చేసి.. కనిష్ఠంగా ప‌న్నులు వేసి.. వీలైనంత ఎక్కువ‌గా ప‌న్నులు చెల్లించేలా విధానాన్ని సిద్ధం చేయాల‌న్న అభిలాష‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నా.. తాజా క‌స‌ర‌త్తు చూస్తే అలాంటివేమీ జ‌రిగిన‌ట్లుగా అనిపించ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా డిసైడ్ చేస్తున్న ప‌న్ను శ్లాబులు.. ప‌క్క‌నున్న దేశాల కంటే ఎక్కువ‌గా ఉండ‌టాన్ని చూసిన‌ప్పుడు కోపం రాకుండా మాన‌దు.

శ్రీన‌గ‌ర్‌లో కేంద్ర ఆర్థిక‌మంత్రి నేతృత్వంలో.. వివిధ రాష్ట్రాల ఆర్థిక‌మంత్రులంద‌రూ క‌లిసి డిసైడ్ చేసిన జీఎస్టీలో గ‌రిష్ఠ ప‌న్నురేటు ఏకంగా 28 శాతం ఉంది. అంటే.. ప్ర‌తి వంద‌లో రూ.28 కేవ‌లం జీఎస్టీ ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది. అది కూడా.. అప్ప‌టికే త‌మ ఆదాయానికి ప‌న్ను క‌ట్టిన త‌ర్వాత చేతిలో ఉండే మొత్తంతో. అంటే స‌గ‌టు జీవి తాను సంపాదించిన వంద‌లో రూ.20 ఆదాయ‌ప‌న్ను కింద క‌ట్టేసి.. జీఎస్టీ కింద మ‌రో రూ.28 క‌ట్ట‌టం అంటే.. వంద‌లో 48 రూపాయిలు ప‌న్నుల‌కే పోవ‌టం చూసుకున్న‌ప్పుడు క‌డుపు మండ‌క మాన‌దు. అన్నింటికి ఇదే సూత్రం అప్లై కాన‌ప్ప‌టికీ.. గ‌రిష్ఠ ప‌న్నును ప్రాతిప‌దిక‌గా తీసుకున్న‌ప్పుడు ఈ గ‌ణాంకాలు అప్ల‌యి కావ‌ట‌మే కాదు.. ఎంతో భారం.
భార‌త్‌లో ప‌న్నుపోటు ఈ స్థాయిలో ఉంటే ఇరుకుపొరుగున ఉన్న దేశాల్లో ప‌న్ను రేట్లు ఎలా ఉన్నాయ‌న్నది చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. చైనా.. పాక్ లో గ‌రిష్ఠ ప‌న్ను 17 శాతం ఉండ‌గా.. బుడ్డ దేశాలైన బంగ్లాదేశ్‌.. శ్రీలంక‌లో 15 శాతం కాగా.. నేపాల్‌లో కేవ‌లం 13 శాతం కావ‌టం గ‌మ‌నార్హం. భార‌త్‌లో ప్రామాణిక ప‌న్ను రేటు 18 శాతం కాగా.. ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో ఇది కేవ‌లం 10 శాత‌మే కావ‌టం ఆలోచించాల్సిన అంశం. ఇక‌.. మ‌న‌దేశంలో జులై ఒక‌టి నుంచి అమ‌లుకానున్న జీఎస్టీలో ప‌న్ను శ్లాబులు చూస్తే.. 5 శాతం మొద‌లు 28 శాతం వ‌ర‌కూ.. కొన్ని వ‌స్తుసేవ‌ల‌కు 28 శాతంతోపాటు అద‌నంగా సెస్ లు ఉండ‌నే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. పెట్రోలియం ఉత్ప‌త్తుల‌తో ధ‌నిక దేశంగా చెప్పుకునే సౌదీలో ఎలాంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. సింగ‌పూర్లో 7 శాతం.. స్విట్జ‌ర్లాండ్‌లో 8 శాతం మాత్ర‌మే ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు. హోట‌ల్లో ఉంటే మాత్రం నాలుగు శాతం ప‌న్ను చెల్లిస్తే స‌రిపోతుంది. ఆస్ట్రేలియా.. ఇండోనేషియాల‌లో మాత్రం వ‌స్తువులు.. సేవ‌ల‌పై ప్రామాణికంగా 10 శాతం ప‌న్నులు వ‌సూలు చేస్తున్నాయి.

పేద దేశ‌మైన ఇండోనేషియాలో కొన్ని వ‌స్తువుల మీద 15 శాతం.. మ‌రికొన్నింటిపైనా 5 శాతం జీఎస్టీ అమ‌ల్లో ఉంది. ద‌క్షిణ కొరియాలో ప్రామాణిక ప‌న్ను రేటు 10 శాతం కాగా.. జ‌పాన్‌లో ఇప్పుడు 8 శాతం ఉంది. 2019 అక్టోబ‌రు 1 నుంచి ఈ ప‌న్నును 10 శాతం చేస్తామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం చెబుతోంది. అమెరికాలో అయితే.. జీఎస్టీ విధానం రెండు అంచ‌ల్లో అమ‌లు చేస్తారు. దేశ‌వ్యాప్తంగా 5 శాతం ఉంటే.. రాష్ట్రాలు ఎవ‌రికి వారు ప‌న్నులు వేసే వెసులుబాటు ఉంది. గ‌రిష్ఠంగా 10 శాతం వ‌ర‌కు ప‌న్ను విధిస్తే(4 రాష్ట్రాల్లోనే ఈ మొత్తాన్ని వ‌సూలు చేస్తున్నారు).. క‌నిష్ఠంగా 1.76శాతం ప‌న్ను (అలాస్కా)ను విదిస్తున్నారు.

ఇదిలాఉంటే సంక్షేమానికి పెద్ద‌పీట వేసే యూరోపియ‌న్ దేశాల్లో జీఎస్టీ భారీగా ఉంటుంద‌ని చెప్పాలి. ఈ దేశాల్లో గ‌రిష్ఠంగా 25 శాతం వ‌ర‌కూ ప‌న్ను ఉంది. అదే స‌మ‌యంలో ప‌లు స‌దుపాయాలు పెద్ద ఎత్తున ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. మౌలిక‌స‌దుపాయాలు అంతంత‌మాత్రంగా ఉంటూనే.. భారీ ఎత్తున ప‌న్నుపోటు భారీగా ప‌డే వైనం దేశంలో క‌నిపిస్తుంది. ఏం త‌ప్పు చేశార‌ని.. దేశ ప్ర‌జ‌లు ఇంత భారీగా ప‌న్ను బాదుడు బాదించుకోవాలి? అని గ‌ట్టిగా అడ‌గాల‌నిపించ‌క మాన‌దు.