Begin typing your search above and press return to search.

24 గంటలూ వినోదమే.. వార్త చానళ్లు కావవి..కామెడీ చానళ్లే!

By:  Tupaki Desk   |   8 Oct 2020 12:30 AM GMT
24 గంటలూ వినోదమే.. వార్త చానళ్లు కావవి..కామెడీ చానళ్లే!
X
నిత్యం బ్రేకింగ్​ న్యూస్​లు, తాజా వార్తలతో ఊదరగొట్టే మన 24 గంటల వార్తచానళ్లను ప్రజలు వార్తల కోసం కాకుండా కేవలం వినోదం కోసం మాత్రమే చూస్తున్నారట. మన దేశవ్యాప్తంగా న్యూస్​ చానళ్లను చూసే వాళ్లను ఓ సంస్థ సర్వే చేస్తే షాకింగ్​ నిజాలు బయటపడ్డాయట. 100 మందిలో దాదాపు 74 శాతం మంది తాము కేవలం వినోదం కోసం వార్తచానళ్లను చూస్తున్నామని కుండబద్దలు కొట్టారట. అంతేకాకుండా చానళ్లలో వార్తలు, ఇతరత్రా సమాచారం కంటే వినోదమే ఎక్కువగా ఉందని వాళ్లు చెప్పారట. వార్తాచానళ్లు చూసే ప్రేక్షకులపై ఐఏఎన్​ఎస్​ సీ-ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి. లాక్​డౌన్​ ప్రభావంతో సినిమాలు, ఇతరత్రా వినోద కార్యక్రమాలు చూసే అవకాశం లేకపోవడంతో ప్రజలు వినోదం కోసం వార్తా చానళ్లను ఆశ్రయించారట. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 5 వేల మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించారు.

సెప్టెంబర్ చివరివారంలో, అక్టోబర్ మొదటివారంలో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా.. భారత్​ లో వార్తా చానళ్లలో న్యూస్​ కన్నా వినోదమే ఎక్కువా? అని అడిగిన ప్రశ్నకు 73.9 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. 22.5 శాతం మంది కాదని, మరో 2.6 శాతం తెలియదని చెప్పారు. 75.1 శాతం మంది పురుషులు.. 72.7 శాతం మంది మహిళలు ఇదే విధమైన అభిప్రాయం చెప్పారు. వయసు వారీగా చూస్తే 55 ఏళ్లలోపు వారు 70 శాతం మంది, 55 ఏళ్లకు పైబడిన వారు 68.7 శాతం వార్తా ఛానళ్లు వినోద చానళ్లుగా పనిచేస్తున్నాయన్నారు.

ప్రాంతాలు, వర్గాల వారీగా చూసినా.. ఇదే రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణ భారతంలో మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువగా 67.1శాతం మంది వార్తా చానళ్లలో న్యూస్ ​కన్నా వినోదం ఎక్కువగా ఉందని చెప్పారు.

లాక్​డౌన్​ ప్రభావంతో సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులంతా వినోదం కోసం టీవీ చానళ్లను ఆశ్రయిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ చానళ్లు కూడా నిజాలు చెప్పకుండా ఓ పక్షం వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ రకమైన నైరాశ్యం ఆవహించినట్టు సమాచారం.