Begin typing your search above and press return to search.

పెట్రోల్ మంట వైసీపీకే సుమా... ?

By:  Tupaki Desk   |   10 Nov 2021 5:30 AM GMT
పెట్రోల్ మంట వైసీపీకే సుమా... ?
X
పెట్రోల్, డీజిల్ ఈ రెండింటినీ నిత్యావసరాలుగానే చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బైక్స్ లేని వారు ఎవరూ లేరు. సామాన్యుడు అంటే ద్విచక్ర వాహనం ఉన్న వాడే అన్నది ఆర్ధిక శాస్త్రం చెప్పే కొత్త నీతి. ఇక ఇంధన ధరల పెరుగుదల ఒక చోటతో ఆగిపోదు, కాయగూరలు, పప్పు ధాన్యాలు సహా అన్నింటి మీద పరోక్షంగా భారంగా మారుతాయి. ఆ విధంగా చూసినపుడు కేవలం పెట్రో మంటకు కాసేపు రగిలి ఊరుకుంటారు అని పాలకులు అనుకుంటే అంతకంటే శుద్ధ తప్పు మరోటి ఉండదు. ఈ దేశంలో ఒకే ఒక్ ఉల్లిపాయ ఢిల్లీ సర్కార్ ని ఒకసారి గద్దె దించింది అన్నది గుర్తుకు తెచ్చుకుంటే అంతకు కోటింతలు పవర్ ఫుల్ పెట్రో మంట అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక కేంద్రం ఏడాదిన్నరగా పెంచుకుంటూ పోయి డెబ్బై రూపాయిలు ఉన్న పెట్రోల్ ని 115 రూపాయలకు చేర్చింది. ఇక సడెన్ గా జ్ఞానోదయం కలిగినట్లు అయిదు రూపాయలు తగ్గించింది. ఇపుడు రాష్ట్రాల వంతు అంటోంది. దాని మీద దేశంలోని అనేక రాష్ట్రాలు తమకు తోచిన తీరున ఎంతో కొంత తగ్గించాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏలికలు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలను తాము పెంచలేదు కాబట్టి తగ్గించమని వింత వాదనను వినిపిస్తున్నారు. పైగా బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణా సీఎం కేసీయర్ అయితే బీజేపీని బాగానే టార్గెట్ చేశారు. మీ వల్లే ఇదంతా అంటూ తగులుకున్నారు. సెస్ చార్జీలు తగ్గిస్తే పెట్రోల్ రేటు యధాస్థానంలోకి వస్తుందని కూడా సూచించారు.

తెలంగాణాలో కేసీయార్ బీజేపీ మీద విరుచుకుపడ్డారు అంటే దానికి ఒక అర్ధం పరమార్ధం ఉంది. అక్కడ బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. పైగా వచ్చే ఎన్నికల్లో గట్టిగా తొడ కొట్టాలనుకుంటోంది. దాంతో బీజేపీ మీద టీయారెస్ గురి పెడుతోంది. కానీ ఏపీలో బీజేపీకి ఏమీ లేదు. పెద్దగా ఉనికి లేని బీజేపీ మీద వైసీపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పెద్ద నోరు చేసుకోవడం వల్ల కాషాయం పార్టీకి పోయేదేమీ లేదు. అది సత్యం కూడా. ఏపీకి బీజేపీ ఏం చేసినా చేయకపోయినా జనాలు తమ ఆగ్రహాన్ని చూపించడానికి కూడా ఏమీ లేనంతగా బీజేపీ సీన్ ఉంది.

మరి జనం తమ మంటను చల్లార్చుకోవాలంటే అధికారంలో ఉన్న వైసీపీనే టార్గెట్ చేస్తారు. పెట్రో మంట పెరిగినా మరేది జరిగినా ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అయినా, ప్రత్యేక హోదా రాకపోయినా, విభజన హామీలు తీరకపోయినా కూడా జనం ముందుగా విరుచుకుపడేది అధికార పార్టీ మీదనే. ఏపీలో ఈ రకంగా బీజేపీ మీద బండలు నిందలు వేసి ఘోర పరాభవం పొందిన చరిత్ర టీడీపీకి ఉంది. కంటికి కనబడని శత్రువుతో నాడు చంద్రబాబు ధర్మ యుద్ధం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇపుడు అదే రాంగ్ స్ట్రాటజీతో వైసీపీ ముందుకు వెళ్తోంది. పెట్రో మంటకు బీజేపీ కారణం అని వైసీపీ పెద్దలు లెక్కలు చెబుతున్నారు. అందులో కొన్ని గణాంకాలు నిజం కావచ్చు.

అయినా సరే ఏపీ సర్కార్ మొత్తం బురద బీజేపీ మీద జల్లేస్తే తాము సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా వైసీపీ అనుకుంటే పొరపాటే అవుతుంది. ఏపీ జనాలకు కూడా కేంద్రమే పెట్రో మంట పెట్టింది అన్నది తెలియనిది కాదు, అయితే ఏపీ సర్కార్ తమకు ఎంత మేరకు ఊరట కలిగిస్తుంది అన్నదే ఇపుడు అంతా చూస్తున్నారు. తన చేతిలో ఉన్న పని చేసి ఎంతో కొంత ధరలను తగ్గిస్తే వైసీపీకి జనాగ్రహం నుంచి తప్పించుకునే చాన్స్ ఉంది. అంతా బీజేపీయే చేసింది అంటూ విమర్శలు చేస్తూ పోతే మాత్రం అంతిమంగా నష్టపోయేది వైసీపీయే. పెట్రోల్ బంకుల వద్ద జనాల రోదన కచ్చితంగా వింటే మాత్రం వైసీపీ ఠక్కున పెట్రోల్ ధరలను ఎంతో కొంత తగ్గించక మానదు. కానీ ఏ గోడూ వినం మా రూటే సెపరేట్ అనుకుంటే కొంప మునిగేది అచ్చంగా ఫ్యాన్ పార్టీకే సుమా.