Begin typing your search above and press return to search.

హోంలోన్లు ఎగవేస్తున్న ప్రజలు.. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   28 Sep 2022 7:50 AM GMT
హోంలోన్లు ఎగవేస్తున్న ప్రజలు.. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణమేంటి?
X
చైనాలో ట్రెయిన్ రివర్స్ అయ్యింది. 'రియల్' సంక్షోభం చుట్టుముడుతోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ గా ఉన్న చైనా ఇప్పుడు కుదేలవుతోంది. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక స్థితిగతులు మారడంతో చైనాలో నిర్మాణ రంగం నిలిచిపోయింది. తాకట్టు ఆగిపోయింది. ఇళ్లు ఇచ్చాక డబ్బులు కట్టించుకోండి అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

చైనాలో అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసినవారు జూన్ లో చేపట్టిన నిరసనలతో అట్టుడికింది. ఇళ్లు కొనుగోలు చేసిన వందలాది మంది తనఖా పెట్టిన ఆస్తుల వాయిదాలు, హోంలోన్ లు కట్టడం మానేశారు. అసమ్మతి స్వరం వినిపించడాన్ని ఏమాత్రం సహించని చైనాలో ఈ స్థాయిలో ప్రజలు నిరసన తెలుపుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.

అపార్ట్ మెంట్ల కోసం డబ్బులు కట్టిన ప్రజలకు బిల్డర్లు ఇళ్లులు అప్పగించకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఆ ఈఎంఐలు కట్టకుండా వదిలేస్తున్నారు. చెల్లింపులను పూర్తిగా ఆపేశారు. ప్రాజెక్టు పూర్తై ఇల్లు చేతికొస్తేనే డబ్బులు చెల్లిస్తానని అంటున్నారు.

ప్రజల చేతుల్లో డబ్బున్నా కూడా బిల్డర్ల నిర్వాకంతోనే వారు ఈఎంఐలు చెల్లించడం లేదు. అపార్ట్ మెంట్ల నిర్మాణ సంస్థలు, బిల్డర్లు స్థిరాస్తిని అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తుండడమే ఇక్కడే సమస్యగా మారింది.

చైనా వ్యాప్తంగా 320 ప్రాజెక్టులలో ఇళ్లను కొనుగోలు చేసినవారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా భారీగా ఉంది. చెల్లించని రుణాల మొత్తం 14500 కోట్ల డాలర్లుగా ఉంది. అంతకంటే ఎక్కువనే ఉండొచ్చని అంటున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలో ఉన్న చైనా ఆర్థికానికి మూలస్తంభం 'నిర్మాణ రంగం'. చైనా ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు వాటా రియల్ ఎస్టేట్ దే. ఇళ్లు, అద్దెలు, బ్రోకరింగ్ సేవలు వంటివర్నీ ఇక్కడ ఒకప్పుడు వెలుగు వెలిగాయి.ఇందులో విశ్వాసం లోపించడానికి ప్రధానంగా 'ఆర్థిక మందగమనం, నగదు లభ్యత తగ్గడమే కారణం. నెమ్మదిగా ఉన్న నిర్మాణ రంగ మార్కెట్ పై ఈ తాజా పరిణామాల ప్రభావం పడడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. చెల్లింపులను నిరాకరించడమేనది నిర్మాణ రంగ ఆర్ధిక వృద్ధికి తీవ్ర విఘాతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా అనుసరించిన జీరో కోవిడ్ స్ట్రాటజీ, తరచూ లాక్ డౌన్ లు, కోవిడ్ నియంత్రణలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతోంది. దీనివల్ల ఆదాయాలు తగ్గడంతోపాటు పొదుపు, పెట్టుబడులూ తగ్గాయి. చైనా రియల్ ఎస్టేట్ కుదేలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.