Begin typing your search above and press return to search.

రాష్ట్రాల ఉచిత టీకా ఎఫెక్ట్..డిఫెన్స్ లో కేంద్రం

By:  Tupaki Desk   |   26 April 2021 4:30 AM GMT
రాష్ట్రాల ఉచిత టీకా ఎఫెక్ట్..డిఫెన్స్ లో కేంద్రం
X
కేంద్రం చేతులెత్తేసింది. ఉచిత టీకాల విషయంలో రాష్ట్రాలపై భారం మోపిందన్న ఆవేదన వినపడుతోంది.. ఓపెన్ మార్కెట్ లోకి టీకాలను తీసుకురావడంతో డిమాండ్ ఎక్కువైంది. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 నుంచి రూ.600 వరకు అమ్మవచ్చని టీకా తయారీదారులు ప్రకటనలు గుప్పించారు..

నిజానికి కరోనా ఇప్పుడు జాతీయ విపత్తు. కేంద్రం తలుచుకుంటే విపత్తు కింద టీకాలన్నింటిని తక్కువ ధరకే తీసుకొని దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందరికీ ఉచితంగా పంచవచ్చు. కేంద్రం బాధ్యత కూడా అదే. కానీ దాన్ని మరిచి 45 ఏళ్ల వరకు వయసున్న వారికి ఉచితంగా పంచి చేతులు దులుపుకుంది. 18 ఏళ్ల పైబడిన వారికి టీకా ను రాష్ట్రాలకే పంపిణీ చేసుకోవాల్సిందిగా పరోక్ష సంకేతాలిచ్చింది.

రాష్ట్రాలకు ఇప్పటివరకు ఉచితంగా టీకాలు పంపిణీ చేసిన కేంద్రం తీరా ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చుకోవాలన్నట్లుగా చెబుతోంది. ఇక రాష్ట్రాలు తమ ప్రజల కోసం ఈ భారాన్ని భరిస్తూ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తామని ప్రకటించాయి. మొదటి ఏపీ, ఆ తర్వాత తెలంగాణ , కర్ణాటక సహా పలు రాష్ట్రాలు తమ ప్రజలకు ఉచితంగా టీకాలు ప్రకటిస్తూ పోతున్నాయి.

ఈ ప్రకటనలు వచ్చినప్పుడు ఇప్పుడు అందరి చూపు కేంద్రం వైపు కనిపిస్తోంది. రాష్ట్రాలే ఇచ్చినప్పుడు కేంద్రం ఎందుకు ఇవ్వలేకపోతోందని.. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

టీకాల కోసం బడ్జెట్ లో కేంద్రం రూ.36వేల కోట్లను కేటాయించింది. ఈ నిధులన్నీ ఎటు పోయాయని ఇప్పుడు మేధావులు ప్రశ్నిస్తున్నారు. అవి మొత్తం కేటాయిస్తే రాష్ట్రాలపై భారం పడదు అంటున్నారు. కానీ ఈ విషయంలో కేంద్రం నోరు మెదపడం లేదు. రాష్ట్రాలు ఉచితంగా ఇవ్వడం నిజంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు పరువు తక్కువ అని.. దీంతో ఇరుకున పడిపోతుందని అంటున్నారు.