Begin typing your search above and press return to search.

ఆ వూళ్లో బక్కెట్లు.. బిందెలతో పెట్రోల్?

By:  Tupaki Desk   |   30 Jan 2016 7:28 AM GMT
ఆ వూళ్లో బక్కెట్లు.. బిందెలతో పెట్రోల్?
X
అవసరం కోసం ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పట్టుకెళ్లటం మామూలే. కానీ.. నెల్లూరు జిల్లా కోవూరులో మాత్రం బక్కెట్లు.. బిందెలతో పెట్రోల్ తీసుకెళుతున్నారు. బక్కెట్లతో.. బిందెలతో పట్టుకెళ్లటానికి పెట్రోల్ బావి ఏమైనా పడిందా? అన్న సందేహం అక్కర్లేదు. ఒక ప్రమాదం ఇలాంటి పరిస్థితికి కారణమైంది. నెల్లూరు జిల్లా నేషనల్ హైవే మీద ఒక పెట్రోల్ బంక్ సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.

ఈ ట్యాంకర్ ను చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి తీసుకెళుతున్నారు. ప్రమాదవశాత్తు ట్యాంకర్ బోల్తా పడిన ఘటన నుంచి డ్రైవర్.. క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. అయితే.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ బయటకు రావటంతో.. దీన్ని పట్టుకునేందుకు అక్కడి సమీప గ్రామానికి చెందిన ప్రజలు బక్కెట్లు.. బిందెలు పట్టుకోవటం మొదలెట్టారు.

ఈ విషయం అక్కడి వారికి దావనంలా వ్యాపించటంతో ఎవరికి వారు వాహనాలు వేసుకొని పెట్రోల్ పట్టుకునేందుకు వచ్చారు. దీంతో తొక్కిసలాట మొదలైంది. ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. పెట్రోల్ లాంటి అతి ప్రమాదకరమైన ఇంధనం రోడ్డుమీద లీక్ అవుతుంటే.. దాని కారణంగా మంటలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. పెట్రోల్ కోసం వారు పడుతున్న హడావుడి చూసి పోలీసులు వారిని అదుపు చేసేందుకు కిందా మీదా పడుతున్నారు.