Begin typing your search above and press return to search.

ఇళ్లకు వెళ్లి ఖాళీ బియ్యం సంచులు తేవటం ఏంది జగన్?

By:  Tupaki Desk   |   15 March 2020 6:52 AM GMT
ఇళ్లకు వెళ్లి ఖాళీ బియ్యం సంచులు తేవటం ఏంది జగన్?
X
ప్రభుత్వం ఏదైనా కానీ ఒక పథకాన్ని ప్రకటించిన తర్వాత.. అది కూడా ప్లాగ్ షిప్ ప్రోగ్రాం అయినప్పుడు దాని నుంచి వెనక్కి తగ్గటం సాధ్యం కాదు. అలా అని.. అరకొర అన్నట్లు వ్యవహరిస్తే.. ప్రభుత్వానికి ఉండే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. జగన్ ప్రభుత్వానికి వ్యూహకర్తలుగా వ్యవహరించే వారి అంచనా లోపమో.. పథకాన్ని డిజైన్ చేసినోళ్లు సరిగా కసరత్తు చేయలేదేమో కానీ.. తాజాగా చేస్తున్న పనులు జగన్ సర్కారును చిన్నబోయేలా చేస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత పేదవారికి పంపిణీ చేసే బియ్యం పథకంపై వినూత్న రీతిలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. జగన్ ప్రభుత్వంలో.. ఎవరూ రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఇంటికే రైస్ పాకెట్లు (5కేజీలు.. 10..20 కేజీలు) లబ్థిదారుని గడప వద్దకే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తామంటూ హడావుడి చేశారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామ సచిలాయ కార్యదర్శకులకు.. ఈ బియ్యం పాకెట్లను పంపిణీ చేసే బాధ్యతను అప్పజెప్పారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చేసరికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బియ్యం సంచుల్ని ఆకర్షణీయంగా తయారు చేశారు. వీటికి సంబంధించిన బోలెడన్ని వార్తలు మీడియాలో కూడా వచ్చాయి. ఒక్కో సంచి తయారీకి ఏకంగా రూ.12 వెచ్చిస్తుందన్న వైనం బయటకు వచ్చి.. అంతా అవాక్కు అయ్యే పరిస్థితి.

బియ్యం పంపిణీ కోసం.. వాటికి వినియోగించే సంచుల కోసమే ఏటా జగన్ సర్కారు రూ.700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇంత భారీ మొత్తం కేవలం సంచుల కోసమా? అన్న ప్రశ్న పలువురి మదిలో మెదిలే పరిస్థితి. ఏమైందో ఏమో కానీ.. తాజాగా ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం ఖాళీ సంచుల్ని తీసుకురావాలని ఆదేశించటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అంటే.. సంచుల్ని వేస్ట్ చేయటం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని.. అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారపక్ష నేతలు చెబుతున్నారు. వాలంటరీలుగా ఎంపిక చేసిన వారు.. ప్రతి ఇంటికి వెళ్లి ఖాళీ బియ్యపు సంచుల్ని తీసుకురావాలన్న మాట.. వారిని అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఇంత గందరగోళం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఏమైనా.. ప్రభుత్వానికి ప్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన ఈ కార్యక్రమానికి వాడేసిన సంచుల్ని సేకరించటం పెద్ద సమస్యగా మారినట్లుగా చెబుతున్నారు. ప్రచారం కోసం వాడేసే వాటినే మళ్లీ వాడాలా? అన్నది క్వశ్చన్ గా మారింది. వీలైనంత త్వరగా ఇలాంటి వాటిపైనిర్ణయాలు తీసుకునే ముందు.. విపరిణామాల గురించి.. ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుందన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తిస్తే మంచిది.