Begin typing your search above and press return to search.

వైరస్ అనుమానంతో దారి మద్యలోనే దించేశారు...అంతలోనే ..?

By:  Tupaki Desk   |   11 Jun 2020 12:30 PM GMT
వైరస్ అనుమానంతో దారి మద్యలోనే దించేశారు...అంతలోనే ..?
X
యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. వైరస్ పేరు చెబితేనే జనం భయంతో వణికిపోతున్నారు. తుమ్మినా.. దగ్గినా.. వైరస్ సోకుతుందేమో అని భయపడిపోతున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నా వైరస్ భయంతో దగ్గరకు వెళ్ళడానికి కానీ, వారికీ సహాయం చేయడానికి కానీ వెనుకాడుతున్నారు. అంతలా మనుషుల్లో మానవత్వాన్ని చంపేసింది ఈ మహమ్మారి. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు తోటి ప్రయాణికులు. ఓ వ్యక్తి అస్వస్థతో రోడ్డు పక్కన పడిపోయాడు. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చుట్టుపక్కల ప్రజలను ప్రాధేయపడ్డాడు. కానీ ఎవరూ ముందుకు రావకపోవడంతో.. చివరకు అక్కడే కన్నుమూశాడు.

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ కు చెందిన శ్రీనివాస్ బాబు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్‌ కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ తీవ్రంగా దగ్గుతుండడంతో తోటి ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. మెదక్ జిల్లా చేగుంట సమీపంలో రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ దగ్గర బస్సులోంచి ఆయనను దింపేశారు. చేగుంట పట్టణం వైపు నడుచుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కిందపడిపోయారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పడంతో కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే అతడు ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.