Begin typing your search above and press return to search.

నిర్మల్ పట్టణ రోడ్ల మీద చేపల్ని పట్టేసిన ప్రజలు

By:  Tupaki Desk   |   23 July 2021 3:39 AM GMT
నిర్మల్ పట్టణ రోడ్ల మీద చేపల్ని పట్టేసిన ప్రజలు
X
రోడ్ల మీద చేపలు పట్టటం సాధ్యమా? మీకేమైనా మతి ఉందా? అదెలా సాధ్యమవుతుంది? అసలు రోడ్లమీదకు చేపలు ఎందుకు వస్తాయి? లాంటి సందేహాలు రావొచ్చు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు.. సాధ్యం కాని సీన్లు వాస్తవ రూపం దాల్చేలా చేశాయి. 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షం నిర్మల్ పట్టణాన్ని వరద నీటిలో చిక్కుకుపోయేలా చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం సైతం నిర్మల్ పట్టణం వరదలో ఎలా చిక్కుకుందన్న విషయంపై ఆరా తీయటం చూస్తే.. తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సీన్లోకి వచ్చి.. భారీ వర్షం పుణ్యమా అని చోటు చేసుకున్న వరద ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నిర్మల్ పట్టణ ప్రజల్ని ఆదుకునేందుకు.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా తక్షణమే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వరద తీవ్రత మీద ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఇంతకూ నిర్మల్ పట్టణం ఎందుకుమునిగింది? ఎలా మునిగింది? రోడ్లు మొత్తం పెద్ద ఎత్తున వరద నీటితో నిండిపోవటమే కాదు.. చేపల్ని పట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలకు 18 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ (జి) మండలంలో ఏకంగా 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో.. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

స్వర్ణ నది, మంజులాపూర్, బంగల్‌పేట్‌ చెరువుల వరదలో కొట్టుకొచ్చిన చేపలు.. నిర్మల్‌ పట్టణంలో భారీగా నీళ్లు నిలిచేలా చేశాయి. రోడ్ల మీద నడుము కంటే కాస్త తక్కువ లోతు వరకు నీళ్లు వచ్చి చేరాయి. వరద నీటిలో పెద్ద.. పెద్ద చేపలు కళ్ల ముందు కనిపిస్తుండటంతో.. స్థానికులు పలువురు వలలు.. చీరలతో చేపల్ని పట్టుకోవటం కనిపించింది. పలువురు నాలుగైదు పెద్ద చేపల్ని చిక్కించుకోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. రోడ్ల మీద భారీగా నిలిచిన వరద నీటిలోనే కొందరు యువకులు ఈత కొట్టటం గమనార్హం.

నిర్మల్ పట్టణంతో పాటు భైంసా కూడా వర్షం తాకిడికి తీవ్రంగా ప్రభావితమైంది. భారీగా వరద నీరు చేరటంతో భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేటు ఎత్తేశారు. దీంతో దిగువున ఉన్న ఆటోనగర్ ప్రాంతం జలదిగ్బంధమైంది. స్థానికులు మొదటి అంతస్తును వదిలేసి.. రెండు.. మూడు అంతస్తుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. భైంసాలోని పలు కాలనీల్లో వరద చోటు చేసుకుంది. శివాజీ చౌక్.. బోయవాడ.. ఇంద్రానగర్.. శాస్త్రినగర్.. నటరాజ్ నగర్.. ఈద్ గాం ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు నిలిచి.. ఇళ్లల్లోకి భారీగా వరదనీరు వెళ్లటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.