Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ జామ్‌ లో రెండు రోజులు గ‌డిచిపోయాయి

By:  Tupaki Desk   |   25 July 2016 4:44 AM GMT
ట్రాఫిక్ జామ్‌ లో రెండు రోజులు గ‌డిచిపోయాయి
X
హైద‌రాబాద్ అన‌గానే చాలామందికి ట్రాఫిక్ ఇక్క‌ట్లు గుర్తొస్తాయి. వ‌ర్షం ప‌డిందంటే న‌ర‌క‌యాత‌న‌. కొన్ని గంట‌లు ట్రాఫిక్ జామ్‌ ని మ‌నం త‌ట్టుకోలేం. అదే, రెండు రోజుల‌పాటు ట్రాఫిక్ జామ్‌ లో ఇరుక్కున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఇప్పుడు బ్రిట‌న్‌ లో జ‌రుగుతున్న‌ది ఇదే. బ్రిట‌న్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఫ్రాన్స్ న‌గ‌రం డోవ‌ర్ వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఒక‌టీ రెండూ గంట‌లు కాదు... దాదాపు 48 గంట‌లుగా ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే రోడ్ల‌మీద నిలిచిపోయాయి. వేల కొద్దీ వాహ‌నాలు.. వాటిల్లో ప్ర‌యాణికులూ దిక్కుతోచ‌క రోడ్ల మీదే ఉండాల్సి వస్తోంది. ఇంతగా జామ్ అయిన ట్రాఫిక్‌ ను క్లియ‌ర్ చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం ఎంతో తెలుసా... జ‌స్ట్‌, మ‌రో రెండు రోజులు స‌రిపోతాయని అధికారులు చెబుతూ ఉండ‌టం మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌రం!

ఇంత‌కీ ఈ ట్రాఫిక్ జామ్‌ కు కార‌ణం ఏంటో తెలుసా... త‌నిఖీలు! ఫ్రాన్స్‌ లోకి వెళ్తున్న బ్రిటిష‌ర్ల‌ను ఒక్కొక్క‌రిగా త‌నిఖీలు చేస్తూ స‌రిహద్దు అవ‌త‌లికి పంపుతున్నారు బ్రిటిష‌ర్లు. ఒక్కో వాహ‌నాన్ని త‌నిఖీ చేసేందుకు 40 నిమిషాలు స‌మ‌యం తీసుకుంటున్నార‌ట‌! వాహ‌నదారుల‌ను ఆపి, ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వేసి, వారి ద‌గ్గ‌ర ధ్రువ ప‌త్రాలు ప‌రిశీలించి.. వాహ‌నంలో భాగాల‌న్నీ అణువ‌ణువూ జ‌ల్లెడ‌ప‌ట్టిన‌ త‌రువాతే వారిని వ‌దులుతున్నార‌ట‌. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంత‌కీ, ఈ శల్య‌శోధ‌న ఎందుకో మాత్రం ఇత‌మిత్థంగా చెప్ప‌డం లేదు. ఇటీవ‌ల యూరోపియ‌న్ యూనియన్ నుంచి బ్రిట‌న్ బ‌య‌ట‌కి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌నిఖీలు చేస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు కొంద‌రు. లేదు, ఉగ్ర‌వాదుల అనుమానాలతో ప్ర‌తీ వాహ‌నాన్ని త‌నిఖీ చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

కార‌ణం ఏదైనా కావొచ్చు కానీ, పెద్ద సంఖ్య‌లో పిల్ల‌లూ వృద్ధులూ మ‌హిళ‌లూ వాహనాల్లో రోజుల త‌ర‌బ‌డి కూర్చోలేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. పోనీ, వారి క‌ష్టాల‌ను దృష్టి పెట్టుకుని ఏవైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా అంటే.. అవి కూడా కంటితుడుపే! ఇప్ప‌టి వ‌ర‌కూ 11వేల వాట‌ర్ బాటిళ్ల‌ను మాత్ర‌మే ట్రాఫిక్‌ లో ఇరుక్కున్న‌వారికి స‌మ‌కూర్చార‌ట‌. దీంతో అక్క‌డ ఇరుక్కున్న‌వారు ఆగ్ర‌హానికి గురౌతున్నారు. మ‌రో 48 గంట‌ల వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని తెలిసి మ‌రీ మండిప‌డుతున్నారు.