Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రజలు హ్యాపీ - ఎంఎల్ఏ, ఎంపీలు అన్ హ్యాపీ ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   19 May 2021 12:30 PM GMT
ఏపీలో ప్రజలు హ్యాపీ - ఎంఎల్ఏ, ఎంపీలు అన్ హ్యాపీ ఎందుకో తెలుసా?
X
ఏపీలో వన్‌మ్యాన్ షో నడుస్తుందా ? అంటే విప‌క్షాల సంగ‌తి ఎలా ఉన్నా అధికార పార్టీ వ‌ర్గాల్లోను కొంద‌రు అదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి. ఏపీలో జగన్ షో నడుస్తుందని. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలైనా, ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరినా అది జగన్ మాత్రమే చేశారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అసలు 2019 ఎన్నికల్లో వైసీపీ భారీగా సీట్లు గెలవడానికి కారణం జగనే. ఆయననే చూసే ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించారు. జగన్ బొమ్మ వల్లే చాలామంది గెలిచేశారు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు లేవు.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రజలకు జగనే కనబడుతున్నాడు. అసలు వారికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఏ పథకం వచ్చినా కూడా అది జగన్ ఇచ్చిందే అని ప్రజలు భావిస్తున్నారు. అకౌంట్‌లో డబ్బులు పడితే చాలు జగనే వేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక దీని వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు హైలైట్ కావడం లేదు. గతంలో ప్రజాప్రతినిధులు ద్వారా పథకాలు అందేవి. కానీ ప్రజలకు నేరుగా డబ్బులు అందించడమే లక్ష్యంగా జగన్ గ్రామ సచివాలయాలని, వ‌లంటీర్లని ఏర్పాటు చేశారు.

సచివాలయాల ద్వారా ప్రజలకు అన్నీ సేవలు అందుతున్నాయి. ప్రతి పథకం అందుతుంది. అటు వ‌లంటీర్లు, ప్రజలకు - సచివాలయాల మధ్య వారథిలాగా పనిచేస్తున్నారు. ఇలా జరగడం వల్ల ప్రజలకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పెద్ద పని లేకుండా పోతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరిగినా సరే ఆ క్రెడిట్ జగన్‌కే వస్తుందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఇక ఇలాగే జరిగితే తమకు సొంతంగా ఇమేజ్ పెరగడం కష్టమని భావిస్తున్నారట. ఎందుకంటే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా వారికి రావాల్సిన మైలేజ్ రావ‌డం లేద‌న్న‌దే వారి బాధ ?

వచ్చే ఎన్నికల్లో సైతం సొంత ఇమేజ్ కంటే జగన్ బొమ్మ చూసే ప్రజలు తమకు ఓటు వేస్తారని అనుకుంటున్నారట. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తిగా ఉన్నా సరే ప్రజలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ ఎప్పటికప్పుడు పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తున్నారు. మొత్తానికైతే ఏపీలో ప్రజలు సంతోషంగా ఉంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం కాస్త బాధపడుతున్నారని చెప్పొచ్చు. దీనికి తోడు క‌రోనా కూడా రావడంతో ఎంపీ, ఎమ్మెల్యేల‌కు నిధులు లేక చేసేదేం లేకుండా పోయింది.