Begin typing your search above and press return to search.

ఫ‌లితాల‌పై టీడీపీ మాట‌... అంతా పాత‌ పాటే బాస్‌

By:  Tupaki Desk   |   24 May 2019 1:21 PM GMT
ఫ‌లితాల‌పై టీడీపీ మాట‌... అంతా పాత‌ పాటే బాస్‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఊడ్చిపెట్టుకుపోయింది. మొత్తం 175 అసెంబ్లీ - 25 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ... 23 అసెంబ్లీ - 3 ఎంపీ సీట్ల‌లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. అంటే.... విప‌క్ష వైసీపీకి ఏ కోశానా పోటీ ఇవ్వ‌లేక‌పోయింద‌న్న మాట‌. అంతేకాదండోయ్‌... 37 ఏళ్ల త‌న ప్ర‌స్థానంలో టీడీపీకి ఇంత ప‌రాభ‌వం ఎదురైన దాఖ‌లానే లేద‌నే చెప్పాలి. 13 జిల్లాలో ఓ నాలుగు జిల్లాల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.... పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో చంద్ర‌బాబు ఒక్క‌రే గెలిస్తే.. మిగిలిన 13 అసెంబ్లీ - రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో ప‌డిపోయాయి.

ఇక క‌ర్నూలు జిల్లాలో స‌త్తా చాటుతామంటూ బీరాలు పలికితే... ఆ జిల్లా ప్ర‌జ‌లు కూడా టీడీపీని పూర్తిగా ఊడ్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపి అండ‌గా నిలిచిన అనంత‌పుప‌రం జిల్లా కూడా ఈ ద‌ఫా టీడీపీని ఛీకొట్టేసింది. ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌యన‌గ‌రం జిల్లాలో టీడీపీ ప్రాతినిధ్య‌మే లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఫ‌లితాల‌తో టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింద‌నే చెప్పాలి. అప్ప‌టిదాకా ఈవీఎంల‌పై నానా ర‌భ‌స చేసిన చంద్ర‌బాబు... నిన్న‌టి ఫ‌లితాల‌తో నోట మాట రాని ప‌రిస్థితి. ఇప్ప‌టికీ చంద్ర‌బాబు తేరుకోలేద‌నుకోండి. మ‌రి చంద్ర‌బాబు మాదిరే షాక్ కు గురైన త‌మ్ముళ్లు ఒక్క‌రొక్క‌రే నోరు విప్పుతున్నారు. త‌మ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించేందుకు క్ర‌మంగా మీడియా ముందుకు వ‌స్తున్నారు.

అయితే త‌మ ఓట‌మిపై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారోన‌న్న విష‌యంపై ఎన్నిక‌ల‌కు ముందు నుంచే పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. ఒక‌వేళ ఓట‌మి త‌ప్ప‌క‌పోతే... దానిని ఈవీఎంల‌పైకి రుద్దేద్దామ‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఈవీఎంల‌పై పోరును మొద‌లెట్టేశార‌న్న వాద‌న కూడా వినిపించింది. టీడీపీ నేత‌ల నుంచి కూడా ఇదే వాద‌న వినిపిస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపించాయి. అనుకున్న‌ట్లుగానే ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్లు త‌మ ఓట‌మిని ఈవీఎంల పైకి నెట్టేశారు. ఈ మేర‌కు జంపింగ్ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డితో పాటు పోలింగ్ సంద‌ర్భంగా స్పీక‌ర్ స్థానంలో ఉండి కూడా జ‌నం చేతిలో దెబ్బ‌లు తిన్న టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద్ ఇదే మాట‌ను వినిపించారు. ఈవీఎం కార‌ణంగానే తాము ఓట‌మి పాల‌య్యామ‌ని వారిద్ద‌రూ చెప్పారు. ఇద్ద‌రు నేత‌లూ వేర్వేరు ప్రాంతాల నుంచే మీడియాతో మాట్లాడిన‌ప్ప‌టికీ... ఇద్ద‌రి నోటా ఇదే మాట వినిపించిందంటే... ఇక త‌మ్ముళ్ల తొండి వాద‌న అంతా... ఈవీఎం ల‌పైనేన‌ని ఇట్టే చెప్పేయొచ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. టీడీపీకి ఈ మేర ఓట‌మి ద‌క్కిందంటే అది తమ చేత‌గాని త‌నం కాద‌ని, కేవ‌లం ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ కార‌ణంగానే తాము ఈ మేర ఓడిపోయామ‌ని త‌మ్ముళ్లు మీడియా ముందుకు క్యూ క‌ట్ట‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.