Begin typing your search above and press return to search.

ఆవు రక్తం తాగేటోళ్లు దాన్ని తినరు

By:  Tupaki Desk   |   25 Oct 2015 5:09 AM GMT
ఆవు రక్తం తాగేటోళ్లు దాన్ని తినరు
X
గో మాంసం వ్యవహారం దేశంలో ఎంత కలకలం సృష్టిస్తుందో తెలిసిందే. గోమాంసం తినకూడదన్న అంశంపై పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ అంశంగా మారి.. కలకలం రేపుతున్న సమయంలో తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వృత్తిరీత్యా పశు వైద్యుడైన మోహన్ భగవత్.. గోమాంస భక్షణ గురించి స్పందిస్తూ ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. కెన్యాలో కరవు కాటకాలు నెలకొన్నసమయంలోనూ ఆవు రక్తాన్ని మాత్రమే అక్కడి ప్రజలు తాగుతారు కానీ దాన్ని మాత్రం చంపి తినరన్నారు. గోవధ మీద దేశవ్యాప్తంగా కలకలం రేపుగున్న సమయంలోనే ఆయన నాగపూర్ లో ఈ అంశంపై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కెన్యా లాంటి దేశంలో కరవు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక పద్ధతిలో ఆవు రక్తాన్ని బయటకు తీస్తారే కానీ.. దాని ప్రాణాలు తీసేందుకు మాత్రం ఇష్టపడరని.. ఆ దేశాల్లో కూడా గోవధ మీద నిషేధం ఉందన్నారు.

‘‘కరవు వచ్చినప్పుడు ఆవు మెడ భాగంలో రక్తనాళానికి ఒక వెదురుబొంగు వంటి దాన్ని గుచ్చుతారు. ఎంతో జాగ్రత్తగా రక్తం తీస్తారు. అంతే కానీ దాన్ని చంపరు. గోవధ మీద అక్కడ నిషేధం ఉంది. ఆవుల్ని.. ఇతర పశువుల్ని చంపటం అక్కడ అపవిత్రంగా.. పాపంగా పరిగణిస్తారు’’ అని చెప్పారు. ఆవుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని.. దాని ప్రాణానికి ఎలాంటి ముప్పు రాకుండా చూస్తారన్నారు. గోవధ నిషేధం మీద.. గో మాంస భక్షణ మీద దేశ వ్యాప్తంగా రచ్చ జరుగుతున్న వేళ.. మోహన్ భగవత్ ఈ అంశంపై నోరు విప్పారు. మరి.. దీనిపై మిగిలిన వర్గాలు ఎలా స్పందిస్తాయో..?