Begin typing your search above and press return to search.

కుళ్లిపోతున్న కరోనా మృతదేహాలు.. ప్రకాశంలో దారుణం..

By:  Tupaki Desk   |   3 July 2020 1:00 PM GMT
కుళ్లిపోతున్న కరోనా మృతదేహాలు.. ప్రకాశంలో దారుణం..
X
మానవత్వం మంటగలుస్తోంది. కరోనా వైరస్ భయం ప్రజలను ఆవహించింది. చనిపోయినా వారి అంత్యక్రియలను కూడా అడ్డుకుంటున్న కుసంస్కృతి దాపురించింది. కేవలం ఒక అంటు వ్యాధితో చనిపోతే వారిని వదిలేస్తున్న దారుణం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లాలో అనాథలా కుళ్లిపోతున్న మృతదేహాల స్థితి మనుషుల్లో అమానవీయతను సూచిస్తోంది.

కరోనాతో చనిపోయిన మృతులకు శ్మశానాల్లో అంత్యక్రియలను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు అధికారులు ప్రయత్నించగా జనం వాటిని అడ్డుకున్న దారుణం వెలుగుచూసింది. దీంతో ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఒంగోలు జీజీహెచ్ లోనే వాటిని భద్రపరచాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా మృతదేహాలు కుళ్లిపోతున్న దైన్యం దయనీయంగా ఉంది.

కరోనా వైరస్ పై ప్రజల్లో ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా జనాలు మాత్రం ఇంకా మూఢ విశ్వాసాలతో కరోనా రోగులు చనిపోతే వారి అంత్యక్రియలను తమ ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో చేయనీయడం లేదు.

ఒంగోలు నగరంలోని దహన వాటికల్లో కరోనాతో చనిపోయిన మృతుల అంత్యక్రియలను జనం అడ్డుకున్నారు. కమ్మపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయడానికి రెడీ కాగా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా వినలేదు. కొన్ని గంటల పాటు అధికారులు మృతదేహాలతో ఎదురుచూసినా స్థానికులు వినలేదు. దీంతో ఓంగోలు జీజీహెచ్ కు శవాలను తరలించారు.

దీంతో పోలీసుల సాయంతో మృతదేహాలను ఒంగోలులోని యరజర్ల శ్మశాన వాటికకు తరలించారు. అక్కడి వారు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మళ్లీ మూడు మృతదేహాలను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.

ఈ పరిస్థితిని ఉన్నతాధికారులకు విన్నవించిన అధికారులు తదుపరి ఆదేశాల వరకు ఆస్పత్రిలోనే భద్రపరుస్తామని తెలిపారు. సీఎం జగన్ సైతం శ్రీకాకుళంలో అప్పట్లో ఇలానే జరిగిన ఘటనపై ప్రజలకు కనికరం చూపాలని విన్నవించారు. మనకూ ఇలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. జనాలు మాత్రం వినకపోవడం గమనార్హం. సభ్యసమాజం తలిదించుకునేలా ఇలా ఒంగోలు వాసులు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.