Begin typing your search above and press return to search.

పులివెందుల‌లో 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు' జ‌నాలు క‌రువు!!

By:  Tupaki Desk   |   19 May 2022 3:59 AM GMT
పులివెందుల‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు జ‌నాలు క‌రువు!!
X
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న 'గడప గడప కు మన ప్రభుత్వం' కార్యక్రమంలో చిత్ర విచిత్రా లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌గా.. వారికి ప్ర‌జ‌ల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనా.. ర‌హ‌దారుల‌పైనా.. రాష్ట్ర అభివృద్ధిపై నా.. ప్ర‌శ్న‌లు గుప్పించారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కొన్ని చోట్ల మ‌హిళ‌లు.. నిల‌దీయ‌డంతో మంత్రులు, ఎమ్మెల్య‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో కూడా అర్ధం కాలేదు.

ఇక‌, మ‌రికొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌స్తున్నార‌ని.. చూసి.. మ‌హిళ‌లు త‌లుపుల‌కు తాళాలు వేసు కుని వెళ్లిపోయిన ప‌రిస్థితి కూడా ఉంది. దీంతో ఎంతో ప్ర‌తిప‌ష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మంలో ఇలాంటి వ్య‌తిరేక‌త‌లు రావ‌డంపై ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. దానికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను బాధ్యుల‌ను చేసే అవ‌కాశం ఉంది. వారి వ‌ల్లే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని కూడా ప్ర‌చారం చేయొచ్చు.

కానీ, సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా, అందునా.. ఆయ‌నను ఆయ‌న కుటుంబాన్ని ద‌శాబ్దాల పాటు వైఎస్ కుటుంబాన్ని గెలిపిస్తున్న పులివెందుల‌లోనూ.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిజానికి రాష్ట్రంలో ఎక్క‌డ ఈ కార్య‌క్ర‌మం ఎలా జ‌రిగినా.. ఇక్క‌డ మాత్రం టాపు లేచిపోయే రేంజ్ సాగాలి. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న వైఎస్ జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు కాబ‌ట్టి.

కానీ,దీనికి భిన్నంగా..ఇక్క‌డ ప్ర‌జ‌లు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్యక్ర‌మాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. తాజాగా కడప పార్లమెంట్ సభ్యుడు, జ‌గ‌న్‌కు సోద‌రుడు వైయస్ అవినాష్ రెడ్డి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప గ‌డ‌ప కు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో సింహాద్రిపురం మండలం, అహోబిలం, రావులకొలను, సుంకేసుల గ్రామాలలో పర్యటించారు. ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అయితే.. ఆయ‌న వెంట కేడ‌ర్ కానీ, మ‌రోవైపు జ‌నాలు కానీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు..చాలా ఇళ్ల వ‌ద్ద 5 నుంచి 10 నిమిషాల సేపు ఎంపీ వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. అంటే.. ఎంపీ వ‌స్తున్నారు.. మ‌నం ముందే ఉందాం.. అనే ఆలోచ‌న‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఈ కార్య‌క్ర‌మం మొక్కుబ‌డిగా సాగింద‌నే వాద‌న ఒక‌వైపు.. మ‌రోవైపు.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉండ‌బ‌ట్టే.. క‌నీసం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. కార్య‌క్ర‌మం హిట్ కాలేద‌ని వాద‌న మ‌రోవైపు వినిపిస్తోంది.