Begin typing your search above and press return to search.

ఈఎంఐలకు కట్టలేక వదిలేస్తున్నారు..

By:  Tupaki Desk   |   4 Nov 2019 9:35 AM GMT
ఈఎంఐలకు కట్టలేక వదిలేస్తున్నారు..
X
దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక మాంద్యం సెగలు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. నగదు లభ్యత లేక.. ఉద్యోగాలు ఊడి.. సంపాదన తగ్గిపోయి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఇప్పుడు దాపురిస్తోంది.

వాహనాలను ఈఎంఐలలో కొన్న వాహనదారులు ఇప్పుడు ఆ కిస్తీలు కట్టలేక వాహనాలనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు వాయిదాలు కట్టకపోతేనే బండిని లాక్కేళ్లే ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు ఇప్పుడు వాహనదారులే తమ బైక్ లను తీసుకుపోండి కట్టలేం అంటుంటే తలలు పట్టుకుంటున్నారు.. లేట్ గానైనా కట్టండి అంటూ ఫైనాన్స్ కంపెనీలు బతిమిలాడే పరిస్థితి ఏర్పడిందట..

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఏకంగా 700కు పైగా ఫైనాన్స్ కంపెనీలు ఆర్థిక మాంద్యంతో మూతపడడం కలకలం రేపుతోంది. వడ్డీ తగ్గించి ఇస్తున్నా కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావడం లేదట.. వడ్డీ తగ్గించినా అప్పు తీసుకున్న రుణగ్రహీతలు వాయిదాలు చెల్లించలేకపోవడంతో ఈ కంపెనీలు కుదేలవుతున్నాయి. కిస్తీలు కట్టని వాహనాలను తీసుకొచ్చి సీజ్ చేసినా వినియోగదారులు ముందుకు రావడం లేదట..

ఫైనాన్స్ లు కట్టలేక ఇప్పుడు వినియోగదారులే తమ వాహనాలను కంపెనీలకు వదిలేస్తున్న పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా కనిపిస్తోంది.. అలా తెచ్చిన ద్విచక్రవాహనాలను ఎక్కడ ఉంచాలో తెలియక కంపెనీలు ఆపసోపాలు పడుతున్నాయి. మాంద్యం దెబ్బకు రెండు నెలలుగా 700 ఫైనాన్స్ కంపెనీలు మూతపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.