Begin typing your search above and press return to search.

పాత నోట్లు ఇంకా డిపాజిట్ చేసుకోవ‌చ్చు

By:  Tupaki Desk   |   27 Jan 2017 5:52 AM GMT
పాత నోట్లు ఇంకా డిపాజిట్ చేసుకోవ‌చ్చు
X
పెద్ద నోట్ల ర‌ద్దు తర్వాతి వాటిల్లో మ‌రో శుభవార్త ఇది.రద్దయిన పాత నోట్లను ఇంకా కలిగి ఉన్న వారికి శుభవార్త. తమ దగ్గర కొద్దో గొప్పో మిగిలి ఉన్న పెద్ద నోట్లను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మరోసారి వెసులుబాటును కల్పించవచ్చని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వకపోవచ్చని, కేవలం డిపాజిట్లకే ఈ వెసులుబాటును ఇవ్వవచ్చని ఆర్బీఐ వర్గాలను ఉటంకిస్తూ ఓ ప‌త్రిక‌ కథనం రాసింది. త్వ‌ర‌లోనే ఈ మేర‌కు అవ‌కాశం రానుంద‌ని తెలిపింది

గ‌త ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ఆకస్మికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31తో రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్ గడువు ముగిసింది. అయితే తాజాగా మ‌రోమారు పాత నోట్ల‌ను డిపాజిట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించేందుకు ఆర్బీఐ వ‌ర్గాలు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లు పేర్కొంది. తాజాగా కల్పించే ఈ అవకాశం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రూ. 2వేల పరిమితిని విధించనుందని పేర్కొంది. ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో సహేతుక కారణాలను వివరిస్తూ పాత నోట్లను ఆర్‌బిఐ నిర్దేశిత కౌంటర్లలో డిపాజిట్ చేసేందుకు గడువు ఇంకా మార్చి 31వ తేదీ వరకు ఉంది.

ఇదిలాఉండ‌గా...పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8 కన్నా ముందు రూ.2000 - రూ.500 నోట్లను ఎంత మొత్తంలో ముద్రించారన్న వివరాలను వెల్లడించేందుకు ఆర్బీఐ నిరాకరించింది. ఇది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) కిందికి వస్తుందని ఆర్బీఐ అనుబంధ భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ (ప్రైవేట్) లిమిటెడ్ (బీఆర్‌ బీఎన్‌ ఎల్) పేర్కొన్నది. ఆర్బీఐ కరెన్సీ ముద్రణ పరిమితిని పెంచేందుకు వీలుగా 21 ఏండ్ల కిందట బెంగళూరులో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలో బ్యాంకు నోట్ల సరఫరా - డిమాండ్ మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేయడం దీని ఉద్దేశం. దీనికి ఏడాదికి 1600 కోట్ల నోట్లను ముద్రించే సామర్థ్యముంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. దేశంలో నోట్ల కొరత ఏర్పడకుండా ఎంత మొత్తంలో కొత్త నోట్లను ముద్రించారో తెలుపాల్సిందిగా ఆర్టీఐ కింద ఒకరు కోరగా, ఆ సమాచారాన్ని సున్నిత కారణాల దృష్ట్యా వెల్లడించలేమని బీఆర్‌ బీఎన్‌ ఎల్ బదులిచ్చింది. భారత సార్వభౌమాధికారం - సమగ్రతలపై; దేశ భద్రత - శాస్త్ర - ఆర్థిక ప్రయోజనాలపై; ఇతర దేశాలతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశమున్నప్పుడు లేదా ఏదైనా నేరానికి పురికొల్పేట్లు ఉన్నప్పుడుగానీ అలాంటి సమాచారం వెల్లడికి నిరాకరించవచ్చు అని సమాచారం హక్కు చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) పేర్కొంటున్నది. కానీ నవంబర్ 8 కన్నా ముందు ఎంత కొత్త కరెన్సీ ముద్రించారన్న సాధారణ సమాచారం ఇవ్వడం ఈ సెక్షన్‌కు ఎలా వర్తిస్తుందో సంస్థ వివరించలేదు. విచిత్రంగా.. మరో సందర్భంలో స్వయంగా ఆర్బీఐ నోట్ల ముద్రణ వివరాలను తెలియజేసింది. నవంబర్ 8కల్లా తమవద్ద రూ.4.94 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నట్టు పేర్కొన్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/