Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?

By:  Tupaki Desk   |   18 Dec 2022 2:30 AM GMT
ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?
X
తెలంగాణా రాష్ట్ర సమితి వయసు రెండు దశాబ్దాలు దాటింది. షార్ట్ కట్ లో టీయారెస్ గా జనం నోళ్లలో నానింది. టీయారెస్ ఒక ఉద్యమ పార్టీగా ఉప ప్రాంతీయ పార్టీగా సత్తా చాటింది. చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించింది. నిజానికి టీయారెస్ కి అది అతి పెద్ద సెంటిమెంట్ ఆ పేరు అతి పెద్ద బలం. టీయారెస్ కంటే ముందే పోరాడి రాష్ట్రం సాధించించుకున్న జార్ఖండ్ ముక్తీ మోర్చా తన పార్టీ పేరులో జార్ఖండ్ ని తీయలేదు.

ఎందుకంటే అదే చాలా స్ట్రెంగ్త్ కాబట్టి. మరి కేసీయార్ కి ఇవన్నీ తెలియవా. ఎందుకో కానీ ఆయన టీయారెస్ ని బీయారెస్ గా మార్చారు. జాతీయ రాజకీయల్లోకి రావాలన్న ఆయన ముచ్చట తీర్చుకునేందుకు ఈ విధంగా చేశారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. దాన్ని ఆయన ఎంతవరకూ గమనంలోకి తీసుకున్నారో తెలియదు. టీయారెస్ ఒక పార్టీగా వచ్చి రాజకీయాల్లో ఉంటూ ఆ మీదట జాతీయ పార్టీగా అవతరిస్తే ఆ విధానం వేరుగా ఉంటుంది.

కానీ ముందు ఉద్యమ పార్టీగానే రంగంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీని రెండుగా విభజించింది. అలా విభజన పార్టీగా టీయారెస్ విభజన వాదిగా కేసీయార్ చరిత్రలో ఒక ముద్ర పడిపోయారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తరువాత ఆ ముద్ర ఒక్క కలం పోటుతోనో ఒక్క పేరు మార్పుతోనో మారిపోతుంది అనుకుంటే చరిత్రను తక్కువ చేస్తున్నట్లు గానే భావించాలి. అలా కనుక చూసుకుంటే బీయారెస్ ప్రయోగం మాత్రం అత్యంత సాహసం, పైగా బిగ్ రిస్క్ అని చెప్పాల్సి ఉంటుంది.

ఇపుడు అదే చేశారు కేసీయార్. ఆయన తాను జాతీయ స్థాయిలో వెలగాలనుకుని అచ్చి వచ్చిన సెంటిమెంట్ ని అధికారం ఇచ్చిన పార్టీని ఒక్క దెబ్బకు పేరు మార్చేసి ఢిల్లీకి వెళ్లారు. కానీ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో బీయారెస్ కి ఏ రాష్ట్రం కూడా ప్రస్తుతానికి కలసివచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. అన్నింటికీ మించి ఏపీ అయితే బీయారెస్ ఆవిర్భావాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఏపీ జనాలకు టీయారెస్ అన్నా బీయారెస్ అన్నా ఏమంత తేడా ఏమీ కనిపించదనే అంటున్నారు. ఎందువల్ల అంటే నిండు కుండ లాంటి ఏపీని రెండుగా చేసింది టీయారెస్ కేసీయార్ అన్నది వారి మదిలో బలంగా నాటుకుపోయింది. ఈ దెబ్బకు చిత్తు అయింది ఏపీ. దాంతో పాటు వందేళ్లకు ఏపీ వెనక్కుపోయింది. ఇక ఎగువ రాష్ట్రంగా తెలంగాణా ఉంటూ నీటి ప్రాజెక్టుల విషయంలో పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఏపీ చూస్తోంది. అదే సమయంలో కరోనా టైం లో ఏపీ సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపేసి మరి రచ్చ చేసిన దాన్ని బాగా గుర్తుంచుకుంటునారు.

ఒక ముక్కగా విడిపోయి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కేసీయార్ కి మరింత బలం ఇచ్చి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే చాన్స్ ఇస్తే ఏపీకే అతి పెద్ద ముప్పు వస్తుందని ఏపీ జనాలకు అర్ధం అవుతున్న విషయం. ఇక బీయారెస్ గురించి రాజకీయంగా పట్టించుకోవడానికి కూడా ఏమీ లేదనే సగటు ఆంధ్రా జనం భావిస్తున్నారు. ఏపీలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ రెండు మూడు పార్టీల మీదనే జనాల గురి ఉంది.

వచ్చే ఎన్నికల్లో కూడా టైట్ ఫైట్ అన్నది వాటి మధ్యనే ఉంటుంది అని ఏపీ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీ జనాలు బాగా విసిగిపోతే తప్ప అంత తేలిగ్గా కొత్త రాజకీయానికి ఇష్టపడరు. ఒక విధంగా ఉద్యమంలో పాలు పంచుకోకపోయినా వివేచన విచక్షణ, నిదానత్వం విషయంలో ఏపీ ఓటర్లు అగ్ర స్థానంలో ఉంటారు. ఇపుడు వారి కళ్ల ముందు ఉన్న పార్టీలు చాలు అనుకుంటున్నారు. అందులో నుంచే వారు రేపటి ఎన్నికల్లో బెస్ట్ ఆప్షన్ ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉంటారని అంటున్నారు.

ఇక బీయారే పేరిట ఏపీలో కేసీయార్ కలియతిరిగినా ఆయన వెంట కొత్త పార్టీ అనుకుని కొంతమంది నాయకులు జెండాలు పట్టినా కూడా ఏపీ రాజకీయాల్లో అయితే పెద్దగా మార్పు రాదు అనే అంటున్నారు. ఈ రోజుకీ దేశంలో బలమైన జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి ఏపీ జనాలు చోటు ఇవ్వడంలేదని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో తాము దశాబ్దాల పాటు నెత్తి మీద పెట్టుకుని ఆదరించిన కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేసింది అన్న కసితో బాధతో ఆ పార్టీని కూడా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితిని కూడా మననం చేసుకోవాలి. మరి పాత్రధారులనే ఇంతలా దూరం పెట్టినపుడు సూత్రధారిగా ఉన్న బీయారెస్ ని ఎలా నెగ్గించి అందలం అందిస్తారు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

ఏపీలో బీఎస్పీ పోటీ చేసింది. అలాగే మరిన్ని కొత్త పార్టీలు వచ్చాయి. కానీ ఏపీ జనాలు మాత్రం ఆ వైపునకు తొంగి చూడలేదు. అందువల్ల బీయారెస్ విషయంలోనూ పెద్దగా అద్భుతాలు ఏవీ ఏపీలో జరగవనే గట్టి విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే హడావుడి అయితే ఆ పార్టీ నుంచి ఉండవచ్చు. అధికారం ఒక రాష్ట్రంలో ఉంది. కేసీయార్ కి వ్యూహాలు ఉన్నాయి. దాంతో పాటు జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్న ఆరాటం ఉంది. ఇవన్నీ కలసి బీయారెస్ జెండా ఏపీలో పాతేందుకు వారి నుంచి బలమైన ప్రయత్నం జరుగుతుంది. కానీ జనాలు మాత్రం పట్టించుకుంటారన్న గ్యారంటీ అయితే ఈ రోజుకు మాత్రం లేదు. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో కాలం చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.