Begin typing your search above and press return to search.

ఆ చెక్ పోస్టు దగ్గర ఏపీ పోలీసులపై రాళ్లదాడి.. జరిగిందేమిటి?

By:  Tupaki Desk   |   27 March 2020 4:52 AM GMT
ఆ చెక్ పోస్టు దగ్గర ఏపీ పోలీసులపై రాళ్లదాడి.. జరిగిందేమిటి?
X
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ - ఏపీ సరిహద్దుల్లోని చెక్ పోస్టు దగ్గర షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఏపీకి చెందిన వారు తమ రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించటం.. అందుకు ఏపీ సర్కారు నో చెప్పటం తెలిసిందే. కరోనా వేళ.. దేశ వ్యాప్తంగా హెల్త్ ప్రోటోకాల్ అమలు అవుతున్న వేళ.. ఎవరికి వారు ఎక్కడికక్కడే ఉండాల్సిన అవసరం ఉంది.

అందుకు భిన్నంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ పోలీసుల అనుమతితో లేఖలు తీసుకొని ఏపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. సరిహద్దుల్లోని ఏపీ పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వందలాదిగా ఉన్న వారిని తిరిగి తెలంగాణకు వెళ్లిపోవాలని ఏపీ పోలీసులు కోరారు. ఒకవేళ.. తాము ఏపీలోకి వస్తామంటే.. కచ్ఛితంగా పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు సిద్ధమని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉంటామని అంగీకరిస్తే.. ఏపీలోకి అనుమతిస్తామని చెప్పారు.

అయితే.. ఇందుకు ఎవరూ ముందుకు రాలేదు. బుధవారం రాత్రి నుంచి పొందుగల చెక్ పోస్టు వద్ద వేచి చూసిన వందలాది మంది.. గురువారం రాత్రి వేళలో.. వారెవరిని ఏపీలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఏపీ సర్కారు తేల్చేయటంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. ఎవరికి వారు తమకు చేతికి అందిన రాళ్లను తీసుకొని.. పోలీసుల మీద దాడికి యత్నించారు. పెద్ద ఎత్తున రాళ్లదాడి చేయటంతో పలువురుపోలీసులకు తలలు పగిలాయి. దెబ్బలు తగిలాయి. దీంతో.. పరిస్థితి భయానకంగా మారింది. దీంతో.. పోలీసులు పెద్ద ఎత్తున లాఠీ ఛార్జ్ చేశారు. అంతేకాదు.. రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి.. తీవ్ర చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు.

మానవతా దృక్పథంతో రాష్ట్రంలోకి అనుమతించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ.. వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. క్వారంటైన్ కు ఒప్పుకుంటే వైద్య పరీక్షలు చేసి రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఏపీ డీజీపీ స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఇదేమీ పట్టించుకోకకుండా పోలీసులసై మూకుమ్మడి దాడి చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయినా.. ఇప్పుడున్న హెల్త్ ఎమర్జెన్సీలో.. ఊళ్లకు వెళ్లే ఆత్రం తప్పించి.. మిగిలిన ప్రజల ఆరోగ్యం పట్టదా? అన్న మండిపాటు వ్యక్తమవుతోంది.