Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన ఉద్యోగులు

By:  Tupaki Desk   |   29 March 2017 5:15 AM GMT
ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన ఉద్యోగులు
X
తెలంగాణ‌లోని అధికార టీఆర్ ఎస్ పార్టీ మ‌రో ఇర‌కాటంలో ప‌డింది.త‌మ‌ది ఉద్యోగుల అనుకూల ప్ర‌భుత్వం అని ముఖ్య‌మంత్రి - స‌హా మంత్రులు చెప్పుకొంటున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. ఆది నుంచి ఒకింత వివాదాస్పదుడిగా ముద్రపడి ఉన్న నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ - అతని అనుచరుల ఆగడాలపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో తమ నిరసన గళం వినిపించారు. అన్ని శాఖలకు చెందిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులంతా మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌ లోని ప్రగతిభవన్‌ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించారు. అంతకుముందు టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ నేతృత్వంలో ఉద్యోగులు బ్యానర్లు చేతబట్టుకుని పెద్ద సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ యోగితారాణాను కలిసి మెమోరాండం సమర్పించారు. ఉద్యోగుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే షకీల్ అనుచరుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులంతా మూకుమ్మడిగా నిరసనకు దిగడం వెనుక అసలేం జరిగిందింటే... గత వారం రోజుల క్రితం బోధన్ నియోజకవర్గం పరిధిలోని రెంజల్ మండలంలో గల కందకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా తెరాస-కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న బోధన్ పట్టణ టిఆర్‌ఎస్ నాయకుడు ఆబిద్ అలీ కందకుర్తి లిఫ్టు వద్దకు చేరుకుని ఇరిగేషన్ అధికారులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రానిచ్చారు.. వారికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారంటూ రాయడానికి సైతం వీలు లేని రీతిలో అసభ్య పదజాలాన్ని వాడుతూ ఈఈలు, డీఈ, ఇతర అధికారులు, లిఫ్టు చైర్మన్ పై తిట్ల పురాణం కురిపించారు. అయితే అధికారులు సర్దిచెబుతూ, వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అసలేమాత్రం వినిపించుకోకుండా నోటికొచ్చిన విధంగా తిడుతూ, ఎక్కడికక్కడ నరికి పారేస్తానని అందరి సమక్షంలోనే బాహాటంగా హెచ్చరికలు చేశాడు.

స్థానిక ఎస్‌ ఐ రవికుమార్ సమక్షంలోనే ఈ దౌర్జన్యకాండ కొనసాగినప్పటికీ, ఆయన కిమ్మనకుండా మౌనంగానే ఉండిపోవడం కూడా ఇతర శాఖల ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే షకీల్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా సదరు ఎమ్మెల్యే కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసే రీతిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉద్యోగులంతా రోడ్డెక్కి ఏకంగా పెన్ డౌన్ ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎ.కిషన్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే షకీల్, అతని అనుచరుల ఆగడాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములం అయ్యామని, ప్రస్తుతం బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ కొంతమంది ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/