Begin typing your search above and press return to search.

మంచంతో నవ్వులపాలైన యువరాజు

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:29 AM GMT
మంచంతో నవ్వులపాలైన యువరాజు
X
భిన్నంగా ఆలోచించటం మంచిదే. కానీ.. అలాంటి ఆలోచనలు వర్క్ వుట్ అయితే బాగానే ఉంటుంది. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు. భిన్నమైన ఆలోచన కారణంగా లాభం సంగతి తర్వాత అసలుకే ఎసరు వస్తేనే ఇబ్బంది అంతా. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ ను భిన్నంగా ప్రజంట్ చేసేందుకు వీలుగా ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ చిత్రమైన ఆలోచన చేశారు.

ఛాయ్ పే చర్చా పేరిట సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐడియా వేసిన ఇదే ప్రశాంత్ కిశోర్ అప్పట్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. తన ఛాయ్ పే చర్చా సూపర్ హిట్ కావటంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఖాట్ సభ’గా మార్చి.. గ్రామాల్లో ఊరి పెద్దల సమక్షంలో జరిగే గ్రామ సభల్ని తలపించేలా భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సభల్లో పెద్ద ఎత్తునమంచాలు ఏర్పాటు చేసి.. సభికులు ప్రశాంతంగా కూర్చునే అవకాశం ఉంటుందని.. వారిని ఉద్దేశించి ప్రసంగించే రాహుల్ తో ఆ పార్టీకి భారీ ప్రయోజనం లభిస్తుందని భావించారు. ఇందుకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ 10వేల మంచాల్ని సిద్ధం చేసింది. తొలి దఫాలో2వేల మంచాల్ని దేవరియా జిల్లా రుద్రపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రయోగాత్మకంగా ఉంచారు. ఇక్కడ వచ్చే స్పందనను చూసి.. తర్వాతి సభల్లో ఈ ఐడియాను అమలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి చందంగా మంచాల సభ కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేసింది. ఈ కార్యక్రమంతో కొత్త తరహా రాజకీయ ప్రచారానికి తెర తీయాలని భావించిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. సభకు వచ్చిన వారు మంచాల కోసం పోటీ పడటమే కాదు.. తమకు రాహుల్ గాంధీ మంచాలు ఇచ్చారంటూ చెప్పుకోవటం కనిపించింది.

మంచాల కోసం పోటాపోటీలు పడటంతో తొక్కిసలాట చోటు చేసుకొని సభ రసాభాసాగా మారింది. ఒక్కరే పట్టుకెళ్లని కొన్ని ఇనుప మంచాలు మినహా మిగిలిన మంచాలన్నింటినీ సభకు వచ్చినోళ్లు పట్టుకెళ్లటంతో జాతీయమీడియాలో ఈ వ్యవహారం ఒక కామెడీ షోగా మారిపోయింది. మొనగాడు లాంటి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ వ్యూహం పెద్ద ప్లాప్ షోను తలపించింది.