Begin typing your search above and press return to search.

ప్రజలు మాట : మాతో పొత్తులు కావాలా వద్దా...?

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 AM GMT
ప్రజలు మాట : మాతో పొత్తులు కావాలా వద్దా...?
X
పొత్తులు అంటే ఒకే మాట ఒకే బాట. అంటే భావసారూప్యం తో ముందుకు సాగడం. నిజానికి అదే ఉంటే రెండు పార్టీలు ఇరవై రెండు అభిప్రాయాలు ఎందుకు. అంటే ఏ రెండు పార్టీలు ఒక్కటి కాదు అని ఇక్కడ తేలిపోతున్న విషయం. మరి ఎవరికి వారే అయినపుడు ఒకరి భావనలు మరొకరికి సరిపడనపుడు పొత్తుల పేరిట ఎందుకు కలవడం అంటే అక్కడే ఉంది అసలైన మతలబు. అదే సిసలైన రాజకీయం. జనాలను ఒక విధంగా మభ్య పెట్టడం.

పొత్తుల పేరిట తమ రాజకీయాలను తాము చేసుకోవడం అన్న మాట. దానికి జనాలకు చెప్పేది ఏంటి అంటే మీ కోసమే ఈ పొత్తులు అని. సరే ఇది బాగానే ఉంది అనుకున్నా పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు సేవ చేయాలనే కదా ముందుకు వచ్చేది మరి. అలా అనుకుంటే కనుక ఆ రాజకీయ పార్టీ ముందుగా చేయాల్సిది ఏంటి. జనాలతో కనెక్ట్ కావడమే కదా. వారితోనే కదా పొత్తు పెట్టుకొవాలి. అలా వారికి జనాలకు చేరువ అయి వారితోనే ఉండాలి కదా.

అలా ఉన్న నాడు ప్రజలతోనే దోస్తీ చేసిన నాడు ఈ పొత్తుల గోల అన్నది అసలు ఉండదు కదా. కానీ ప్రజా స్వామ్యంలో అసలైన ప్రభువులుగా ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి వారి అభిప్రాయాలను పూర్తిగా వెనక్కి నెట్టేసి తమ స్వార్ధానికి రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు జత కట్టి ముందుకు వస్తున్నాయి అనుకుంటే తప్పేముంది.

నిజానికి ప్రజాస్వామ్యం అంటే ఒకటికి మించి ఎక్కువ అవకాశాలు ఉండడం. దానిలో తమకు వీలు అయిన దానిని ప్రజలు ఎంచుకోవడం. మరి అలాంటి అవకాశాలను లేకుండా చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్య నీతి. నాలుగైదు పార్టీలు అన్నీ కలసి గుంపుగా రావడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఆ అయోమయంలో జనం చేతుల నుంచి ఓటును గుంజుకోవడం ద్వారా అధికార సోపానానికి సులువైన మార్గం వేసుకోవడమే కదా.

అంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా ని కలవడం కాదు, ప్రజాస్వామిక సూత్రాల మేరకు అది ఎంతవరకు సబబు అన్నది కూడా రాజకీయ పార్టీల పెద్దలు ఆలోచన చేయాలి కదా. ఇక ప్రజలను మంచి చేసుకుని వారితోనే ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు బలహీనపడుతుంది. మరొకరితో కలిసే దుస్థితి ఎలా కలుగుతుంది. అంటే నయా రాజకీయానికి ప్రజలు అవసరం లేదు, వారి అభిప్రాయాలు అవసరం లేదు.

తామంతా ఒక్కటిగా ఒకే తానులో ముక్కలు అన్నట్లుగా గ్రూపు ఫోటో పెట్టుకుని జనాల్లోకి వస్తే వారి ఆ మాయలో పడి వారు ఆదరించాలన్న దురూహే కదా ఇందులో దాగుంది అంటే జవాబు ఏమి చెబుతారు. మరో వైపు చూస్తే ప్రజలు ఈ మాదిరి అవకాశవాద పొత్తులను కోరుకుంటున్నారా అన్నది కీలకమైన ప్రశ్న.

ప్రజల కోసం అంటూ గొంతు చించుకుంటున్న నాయకులు అంతా కలసి మంద బలం చూపించి ఓట్ల వేటకు తయారు కావడం తప్ప ఈ పొత్తులకు సిద్ధాంతబద్ధత నీతి నిజాయతీ ఉందా అన్న ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు. ఇక ఇక్కడ మరో కీలకమైన విషయం కూడా ముచ్చటించుకోవాలి. ప్రజలను మరీ అమాయకులుగా ఏమీ తెలియని వారుగా జమకట్టేస్తున్నారా అన్నదే ఆ ఆవేదన.

అన్ని పార్టీలు విడిగా వస్తే అధికార పార్టీ గెలుస్తుంది అని నేతలు అంటున్నారు. అది అలాగే జరుగుతుంది అని మీరు చెప్పగలరు, ఏ రాజకీయ సూత్రీకరణ ప్రకారం అలా మాట్లాడుతున్నారు అంటే జవాబు ఏం చెబుతారు. ప్రజలకు అన్నీ తెలుసు కదా. వారు ఎవరిని కోరుకుంటే వారికే ఓటు వేస్తారు. పది మంది కలసి వచ్చినా విడిగా వచ్చినా కూడా ప్రజలు తాము ఎవరిని ఎన్నుకోవాలో వారినే ఎన్నుకుంటారు.

గత ఏడున్నర దశాబ్దాల రాజకీయాల్లో అనేకసార్లు రుజువు అయింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఒకే రకమైన అభిప్రాయం దేశం మొత్తం రావడం ఎన్నో ఎన్నికల్లో అంతా చూశారు. అంతలా ఉంటుంది ప్రజల వివేచన. మరి దాన్ని తక్కువ చేసి, తమను తాము బలహీనులుగా చిత్రీకరించుకుని ఈ పొత్తుల పేరిట ఆయాశపడడం అంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లే అని నేతలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు.

ఇక ఒక పార్టీ సిద్ధాంతాలు అంతలా నచ్చితే పొత్తులు కాదు, రెండు మూడు పార్టీలు అన్నీ కలసి పోయి ఒకే పార్టీగా జనం ముందుకు వస్తే బాగుంటుంది కదా. ఎందుకు వేరు వేరు జెండాలు అజెండాలు. జనతా ప్రయోగం అని ఇపుడు నాయకులు అంటున్నారు. నాడు జరిగింది ఇదే కదా. అన్ని పార్టీలు కలసి జనతా పార్టీగా ఒక్కటే జెండాతో జనం ముందుకు వచ్చాయి కదా.

ఇక పొత్తుల పేరిట జనాల నుంచి ఓట్లు తీసుకుని రేపటి రోజున అధికారంలోకి వచ్చాక ఆ మోజులు పొయి పొత్తులు చిత్తు అయి దోస్తీ నాస్తి అయ్యాక ఆరాటాలు పోరాటాలతో సర్కార్ ని ఇబ్బంది పెడితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు. అపుడు ప్రజలు ఏమి చేయగలుగుతారు. అందుకే దేనికైనా క్లారిటీ ఉండాలి. అది లేకపోవడం వల్లనే రాజకీయాలు ఇలా తయారయ్యాయి అనుకుంటే తప్పేముంది.