Begin typing your search above and press return to search.

ద‌య‌చేసి మంచాలు ఎత్తుకెళ్లొద్దు!

By:  Tupaki Desk   |   14 Sep 2016 2:17 PM GMT
ద‌య‌చేసి మంచాలు ఎత్తుకెళ్లొద్దు!
X
అవును. ఇది ప్ర‌క‌ట‌నే.మీరు ఊహించన‌ట్లే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్ర‌క‌ట‌న‌. అయితే ఇదేదో చెవుల్లో చెప్పింది కాదు..ఏకంగా మైకుల‌లో అనౌన్స్ చేసేశారు మ‌రి. యూపీలో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా స‌భ‌లు ఏర్పాటు చేస్తున్న‌ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ స‌మావేశాల‌కు మంచాల బాధ త‌ప్ప‌డం లేదు. ఏదో కొత్త‌గా చేద్దామ‌ని ఆలోచించి స‌భ‌ల్లో మంచాలు వేస్తే...అవి కాస్త‌ ఇప్పుడు కాంగ్రెస్‌ కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

తొలి స‌భ‌లోనే 2 వేల మంచాల‌ను ఎత్తుకెళ్లారు స‌భ‌కు వ‌చ్చిన గ్రామ‌స్థులు. ఆ త‌ర్వాత మ‌రో స‌భ‌లో మ‌నుషుల‌ను పెట్టి మ‌రీ మంచాలు ఎవ‌రూ ఎత్తుకు వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌ని చూసి కాంగ్రెస్‌ అభాసుపాలైంది. తాజాగా మీర్జాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మ‌రో స‌భ‌లో రాహుల్ గాంధీ మాట్లాడ‌టం పూర్త‌వ‌గానే.. ద‌య‌చేసి మంచాలు ఎవ‌రూ తీసుకెళ్లొద్దు అంటూ కాంగ్రెస్ నేత‌లు మైకుల్లో అనౌన్స్ చేశారు. అయినా స‌రే అప్ప‌టికే ఆరు మంచాల‌ను స‌భ‌కు వ‌చ్చిన వాళ్లు ఎత్తుకెళ్లినా.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వాటిని వెంట‌నే తిరిగి తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతుల‌ను మీడియా సంప్ర‌దించ‌గా మంచాలు ఇస్తార‌ని చెప్ప‌డంతోనే తాము స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు ఇదే విష‌యం చెప్పార‌ని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండ‌గా తొలి స‌భ‌లోనే మంచాల చోరీపై పెద్ద ర‌భ‌సే జ‌రిగింది. వెరైటీగా స‌భ‌లో మంచాలు వేయాల‌న్న‌ది వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆలోచ‌న‌. ఆయ‌న సూచ‌న ప్ర‌కార‌మే కాంగ్రెస్ ఈ మంచాల స‌భ‌కు సిద్ధ‌మైంది. కానీ ప్ర‌తి స‌భ‌లోనూ వాటితో కాంగ్రెస్‌ కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఈ వినూత్న స‌భ‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నా.. అద్దెకు తెచ్చిన ఆ మంచాల‌ను కాపాడుకోవ‌డం ఆ పార్టీకి పెద్ద స‌వాలే అయింది.