Begin typing your search above and press return to search.

'ఫ్యాట్‌ ఫైల్‌ సిండ్రోమ్' తో భాదపడుతున్న ప్రజలు..అంటే ఏమిటంటే!

By:  Tupaki Desk   |   14 Aug 2020 6:00 AM GMT
ఫ్యాట్‌ ఫైల్‌ సిండ్రోమ్ తో భాదపడుతున్న ప్రజలు..అంటే ఏమిటంటే!
X
అనుమానమే సగం రోగం .. అలాగే ఆనందంగా ఉంటే సగం రోగం అక్కడే నయం అవుతుంది అని అంటారు. ప్రస్తుత కరోనా కాలంలో విస్తృతంగామారిందనడానికి కొందరు జనాల తీరు విస్మయపరుస్తోంది. ఫ్యాట్‌ ఫైల్‌ సిండ్రోమ్‌ అనే మానసిక వ్యాధిలక్షణాన్ని తలపిస్తోంది. ఎలాంటి రుగ్మత - అనారోగ్య లక్షణాలులేకుండానే తమకు ఏదో జబ్బు ఉన్నట్లు ఊహించుకొని రకరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటారు. మాములుగా అయితే, ఇలాంటి వారు తక్కువ మంది ఉంటారు. కానీ , కరోనా పుణ్యమా ఫ్యాట్‌ ఫైల్‌ సిండ్రోమ్‌ తో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు మానసిక వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్య లేని వారు సైతం ఈ కరోనా వైరస్‌ సోకిందేమోననే ఆందోళనకు గురై - హాస్పిటల్స్ కి వెళ్తున్నారు.

ఒకటికి రెండుసార్లు కరోనా‌ టెస్టులు చేసుకుంటున్నారు. పరీక్షల్లో ‘నెగెటివ్‌’ అని తేలినప్పటికీ రెండోసారి, మూడోసారి టెస్టులకు కూడా వెళ్తున్నట్లు హైదరాబాద్‌ సైకియాట్రిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ సతీష్‌ సంగిశెట్టి విస్మయం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ ఎలాంటి పరీక్షలకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారు కొందరైతే.. ఏ లక్షణాలూ లేకపోయినా పదే పదే టెస్టులతో ఆందోళన పెంచుకుంటున్నవారు మరికొందరు. ఈ విదంగానే .. హైదరాబాద్ బోయిన్‌ పల్లికి చెందిన ఓ కుటుంబంలో 8 మంది ఉంటారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలాంటి సమస్యలూ లేవు. పైగా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ.. కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్‌ ఎనిమిదేళ్ల కూతురు రెండు మూడుసార్లు తుమ్మడంతో ఇంట్లో ఆందోళన మొదలైంది. అందరూ కలిసి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు పరుగులు తీశారు. కోవిడ్‌ టెస్టుల్లో అందరికి ‘నెగెటివ్‌’ అని తేలిపోయింది. కానీ.. రూ.30 వేల వరకు సమర్పించుకోవాల్సివచ్చింది.

కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో ఒక్కరిద్దరు కరోనా బారిన పడితే మిగతావాళ్లు తమకు లక్షణాలు లేకపోయినా టెస్టుల కోసం వెళ్తున్నారు. నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల వద్ద నిర్వహించే ర్యాపిడ్‌ పరీక్షల్లో - ప్రైవేట్‌ ల్యాబ్‌ లకు టెస్టుల కోసం అనుమానంతో వచ్చేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇటీవల ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 250 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి మాత్రమే పాజిటివ్‌ అని తేలింది. సాధారణ ఫ్లూ లక్షణాలతో టెస్టులకు వచ్చిన వాళ్లను మినహాయిస్తే 170 మంది వరకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కేవలం అనుమానంతో వచ్చినట్లు ఒక అధికారి చెప్పారు. అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు అనుమానించి అవసరమైన పరీక్షలు చేసుకోవడం, వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. కానీ ఏ లక్షణాలు లేకపోయినా పదే పదే ఏదో ఒక జబ్బును ఊహించుకొని ఆందోళనకు గురికావడం, సొంతంగా పరీక్షలకు వెళ్లడం సరైంది కాదు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.