Begin typing your search above and press return to search.

అఫ్గాన్ ఎపిసోడ్ చూశాక ట్రంప్ ఉంటేనే బాగుండేదేమో?

By:  Tupaki Desk   |   17 Aug 2021 1:34 AM GMT
అఫ్గాన్ ఎపిసోడ్ చూశాక ట్రంప్ ఉంటేనే బాగుండేదేమో?
X
అఫ్గానిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అగ్రరాజ్యమైన అమెరికాలో కొత్త కాకను రేపుతున్నాయి. అఫ్గాన్ ఇష్యూను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లకు ఏళ్లు అఫ్గాన్ లో ఉంటూ.. ఆ దేశ ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్న అగ్రరాజ్యం.. ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి అడుగులు వేసిన వైనం అగ్రరాజ్య ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. తాజాగా అప్గాన్ ఎపిసోడ్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. బైడెన్ చేసిన తప్పులే తాజాగా అఫ్గాన్ లో నెలకొన్న పరిస్థితికి కారణమని.. బైడెన్ రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నారు ట్రంప్.

తన నిర్ణయాలతో అమెరికాకు తలవంపులు తీసుకొచ్చారని.. అందుకు బైడెన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్నది ట్రంప్ డిమాండ్. గడిచిన రెండు దశాబ్దాలుగాఅమెరికా.. నాటో బలగాల సంరక్షణలో ఉన్న అఫ్గానిస్థాన్ ను తాజాగా తాలిబన్లు హస్తగతం చేసుకోవటాన్ని ట్రంప్ తప్పు పట్టారు. అయితే.. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. అఫ్గాన్ నుంచి అమెరికా.. నాటో దళాల్ని వెనక్కి పిలిపించాలన్న నిర్ణయం ట్రంప్ హయాంలోనే తీసుకున్నారు. దీన్ని బైడెన్ ఫాలో అయ్యారని చెప్పాలి. కానీ.. అమెరికాతో తాలిబన్లు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసే వేళలో.. ట్రంప్ ప్రభుత్వం పెట్టిన షరతుల్ని తాజా ప్రభుత్వం లైట్ తీసుకోవటంతోనే ఇప్పుడున్న పరిస్థితికి కారణమన్న విమర్శ ఉంది.

అఫ్గాన్ విషయంలో జో బైడెన్ గొప్పపని చేశారంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించిన ట్రంప్.. ‘అమెరికా చరిత్రలో జరిగిన ఫెయిల్యూర్స్ లో ఇది ఒకటిగా నిలిచి పోతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో అప్గాన్ మీద తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. తాలిబన్లపై చేస్తున్న యుద్ధం ఖర్చు తలకు మించి భారం కావటంతో అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగే ప్రక్రియకు ఆయన ప్రభుత్వంలో బీజం పడింది. ఆయన అంచనా ప్రకారం బైడెన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహకరణ పూర్తి కావాలని బైడెన్ ఆదేశించారు. అంతకు ముందు తాలిబన్ల ప్రతినిధులతో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం.. అఫ్టాన్ లోని ప్రజాప్రభుత్వంతో అధికారాన్ని పంచుకోవాలన్న షరతును బైడెన్ సర్కారు గట్టిగా పట్టుబట్టలేదు.

ఈ కారణంతోనే అమెరికా అంచనా వేసుకున్న సమయానికి చాలా ముందుగానే అఫ్గాన్ తాలిబన్ల వశమైందని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అఫ్గాన్ లో ఉన్న అమెరికన్లను అతికష్టమ్మీద తీసుకొస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తాను కానీ అధికారంలో ఉండి ఉంటే.. తాజా ప్రక్రియ మరింత శాంతియుతంగా ఉండేదన్నారు. అఫ్గాన్ ప్రభుత్వం త్వరగా పడిపోతుందన్న వాదనను జో బైడెన్ తోసిపుచ్చేవారు. కానీ.. ఆయన మాటలకు భిన్నంగా నెల తిరగక ముందే తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తాజా అఫ్గాన్ ఎపిసోడ్ ను చూసినప్పుడు.. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించి ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు కచ్ఛితంగా ఉండేవి కావన్న మాట వినిపిస్తోంది.