Begin typing your search above and press return to search.

అలా ఫీల్ కావాల్సింది ప్రజలు కానీ మీరు కాదు పట్టాభి!

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 AM GMT
అలా ఫీల్ కావాల్సింది ప్రజలు కానీ మీరు కాదు పట్టాభి!
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేరు చెప్పినంతనే.. పదవుల కోసం.. అధికారం కోసం ఆయన తెగ ఆరాట పడిపోతుంటారని.. ఆయన చేతికి పవర్ ఇప్పించాలన్న తపన ఎల్లో మీడియాకు ఎక్కువనే ఆరోపణలు ఒక రేంజ్లో వినిపిస్తాయి. ఇలాంటి వాటిని తెలుగు తమ్ముళ్లు పెద్దగా పట్టించుకోరు కానీ..ఏపీ రాష్ట్ర ప్రజల్లో అలాంటి భావనే ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. ఇలాంటి వాదనకు బలం చేకూరేలా తెలుగు తమ్ముళ్లు అవసరానికి మించి చెలరేగిపోతుంటారు.

తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితుల వేళ.. ఇలాంటి టైంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఎంత బాగుండేదన్న భావన తెలుగు ప్రజలకు కలగాలే కానీ.. తెలుగు తమ్ముళ్లకు కాదు. అలాంటి మాటలు టీడీపీ నేతల నోటి నుంచి రావటాన్ని ఏపీ ప్రజలు అంగీకరించటం లేదు. ఎందుకంటే.. కరోనా పోరు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆయన్ను నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా.. ఏదో ఒక రచ్చ చేస్తున్నారన్న ఆరోపణ పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

ఇప్పుడు కానీ చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితులు మరింత దిగజారేవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించటాన్ని టీడీపీ నేత పట్టాభి తీవ్రంగా తప్పు పట్టారు. సీఎం పదవి నుంచి వారం రోజుల పాటు జగన్ తప్పుకొని ప్రతిపక్ష నేతకు బాధ్యత అప్పగిస్తే.. కరోనా గండం నుంచి ఎలా గట్టెక్కించాలో చేసి చూపిస్తారని పట్టాభి సవాలు విసురుతున్నారు. వారం రోజుల పాటు చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించటానికి సిద్ధమా? అంటూ సవాల్ విసురుతున్నారు.

కరోనా లాంటి విపత్తు వేళ.. తమకు ముఖ్యమంత్రిగా జగన్ కాదు చంద్రబాబు ఉంటే బాగుంటుందన్న భావన ప్రజల్లో కలగాలే కానీ తమ్ముళ్లకు కాదు. ప్రజల్లోని ఫీలింగ్ బయటకు ఎలా తెలుస్తుందన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. గతంలో ఉండేవు కాదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా.. వాట్సాప్.. యూట్యూబు వీడియోలు ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే మాథ్యమాలు ఉన్నాయి. నిజంగానే జనాల్లో అలాంటి ఫీలింగ్ కలిగితే.. ఇప్పటికే అలాంటి వీడియోలో.. మెసేజ్ లు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయి ఉండేవి.

అంతేకాదు.. ప్రజల్లో అలాంటి భావన రావటం షురూ అయి ఉంటే.. అధికారపక్షం నోటి నుంచి చంద్రబాబు మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయరన్న విషయాన్ని పట్టాభి లాంటి సీనియర్ తమ్ముళ్లు ఎప్పటికి అర్థం చేసుకుంటారో? పాదయాత్ర చేసే సమయంలో జగన్ కు వస్తున్న ప్రజాభిమానం గురించి.. తెలుగుదేశం పార్టీ నేతలే తమ ప్రైవేటు సంభాషణల్లో పెద్ద ఎత్తున చర్చించుకునేవారు. కరోనా అపత్ కాలంలో జగన్ పాలన బాగుండకపోయినా.. బాబు గురించి ఆలోచనలు ప్రజల్లో ఎక్కువ అవుతున్నా.. ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అలాంటప్పుడు అనవసర వ్యాఖ్యలు చేసి ప్రజల్లో పలుచన అయ్యే కన్నా.. కామ్ గా ఉండటం మంచిదేమో పట్టాభి? కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.