Begin typing your search above and press return to search.

మైలేజీ త‌ర్వాత‌.. ఈ డ్యామేజ్ అవ‌స‌ర‌మా సారూ?

By:  Tupaki Desk   |   11 Jun 2019 2:30 PM GMT
మైలేజీ త‌ర్వాత‌.. ఈ డ్యామేజ్ అవ‌స‌ర‌మా సారూ?
X
ఆశ‌కు మితం ఉండాలి. అవ‌స‌రానికి మించి తింటే ఏమ‌వుతుంది. అజీర్తి అవుతుంది. అయినా ఆప‌కుండా తింటే ఏమవుతుంది మొద‌టికే మోసం వ‌స్తుంది. తాజాగా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టిసారిస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఒక‌సారి ఫిక్స్ అయితే.. ఇక తిరిగి ఆలోచించ‌ని తీరు కేసీఆర్ లో కాస్త ఎక్కువే. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి అన్న‌ది ప్ర‌శ్న‌గా మారి.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది లేని రీతిలో కాంగ్రెస్ ను మార్చాల‌న్న ప్ర‌య‌త్నం పూర్తి అయిన హ్యాపీ మూడ్ లో ఉన్న సారు.. వాస్త‌వాలు కొన్నింటిని మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నార‌న్న విమ‌ర్శ వినిపిస్తుంది.

ప్ర‌భుత్వానికి బ‌లం లేన‌ప్పుడు.. ఎవ‌రి కార‌ణంగా అయినా ప్ర‌భుత్వం ప‌డిపోయే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ప్పుడు.. ఇలా వేరే పార్టీల‌కు చెందిన నేత‌ల్ని తీసుకురావ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటిదేమీ లేకుండా ఉన్న వేళ‌.. అధికార‌ప‌క్ష‌మే త‌ప్పించి ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షం అన్న‌దే ఉండ‌కూడ‌ద‌న్న విమ‌ర్శ కేసీఆర్ స‌ర్కారు మూట‌క‌ట్టుకుంద‌ని చెప్పాలి.

పాల‌న‌లో త‌న మార్క్ వేస్తున్న కేసీఆర్‌.. లేనిపోని కంప‌ను మీద వేసుకున్న‌ట్లుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. త‌మ ఉనికిని ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తున్న ముఖ్య‌మంత్రిగా విప‌క్షాలు విరుచుకుప‌డ‌టం లాంటివి అధికార‌ప‌క్షానికి ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల్లో ప్రభుత్వం ప‌ట్ల ప్ర‌తికూల‌త పెంచే వీలుంటుంది.

ఆశ‌ను అర్థం చేసుకునే ప్ర‌జ‌లు అత్యాశ విష‌యంలో మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే ప్ర‌మాదం పొంచి ఉందన్న విష‌యాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా చేసిన‌ విలీనంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోడ్ల మీద‌కు వ‌చ్చి పోరాటాలు షురూ చేసింది. ఆందోళ‌న‌ల్ని ముమ్మ‌రం చేస్తోంది. ఇవ‌న్నీ కూడా అన‌వ‌స‌ర‌మైన అంశాలే. ఇలాంటి వాటితో సీఎంకు మైలేజీ కంటే డ్యామేజీనే చేస్తాయి. తాజాగా కోర్టు స్పందించిన తీరును మ‌ర్చిపోకూడ‌దు.తాను త‌ప్పితే మ‌రెవ‌రూ ఉండ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న తెలంగాణ లాంటి చైత‌న్యం వెల్లివెరిసే స‌మాజానికి సూట్ కాద‌న్న విష‌యం ఉద్య‌మ‌నేత‌గా బారెడు గ్రాఫ్ ఉన్న గులాబీ అధినేత‌కు తెలియ‌క‌పోవ‌టం ఏమిటి చెప్మా?