Begin typing your search above and press return to search.

జనాలకు చుక్కలు చూపిస్తున్న ఏటీఎంలు

By:  Tupaki Desk   |   11 Nov 2016 9:35 AM GMT
జనాలకు చుక్కలు చూపిస్తున్న ఏటీఎంలు
X
పెద్దనోట్ల రద్దు దేశ ప్రజలకు ఎన్ని కష్టాలు తీసుకురావాలో అన్ని కష్టాల్ని తీసుకొస్తోంది. పిడుగులాంటి వార్తను ప్రకటించిన ప్రధాని మోడీపై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు చిన్న నోట్ల కష్టాలపై వారు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే పెద్ద నోట్లు చెల్లుబాటు కాకుండా చేసిన ప్రధాని దెబ్బతో ప్రజలు షాక్ తిన్నారు.

అనంతరం ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకులకు సెలవు ప్రకటించటం.. పెద్దనోట్లను చిన్న నోట్లకు మార్చుకోవటానికి విధించిన పరిమితులు అన్ని బాగానే ఉన్నా.. వీటన్నింటికి సిద్ధంగా లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని ప్రకటన తర్వాత రెండు రోజులకు ఏటీఎంలు పని చేస్తాయన్న భరోసాతో ఎంతోమంది ఎదురుచూశారు.

అందరూ అనుకున్నట్లే శుక్రవారం నుంచి పని చేయాల్సిన ఏటీఎంలు పని చేయకపోవటంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పలు ఏటీఎంలలో నగదును నింపకపోవటంతో అవి పని చేయటం లేదు. చేతిలో ఉన్న డబ్బుల్ని రెండు రోజులుగా ఆచితూచి ఖర్చు చేసిన ప్రజలు.. ఏటీఎంమీద ఉన్న ఆశతో ఖర్చు చేసి..ఇప్పుడు అవి పని చేయకపోవటంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఏటీఎంలలో క్యాష్ నింపే సంస్థలు.. బ్యాంకుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు చెబుతుంటే.. అలాంటిదేమీ లేదు.. బ్యాంకుల తీరుతోనే ఏటీఎంలు పని చేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ఏమైనా తిప్పలు మాత్రం ప్రజలకే అన్నది నిజమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/