Begin typing your search above and press return to search.

ఏటీఎంలు ఇక కాయిన్ బాక్సులేనా...

By:  Tupaki Desk   |   14 March 2017 6:28 AM GMT
ఏటీఎంలు ఇక కాయిన్ బాక్సులేనా...
X
దేశంలో టెలికాం విప్లవం మొదలైన కాలంలో కాయిన్ బాక్సులు అడుగడుగునా ఏర్పాటయ్యాయి. రూపాయి కాయిన్ వేస్తే చాలు ఫోన్ మాట్లాడుకునే వీలుండేది. కొన్నాళ్ల పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఇవి ఆ తరువాత సెల్ ఫోన్ల రాకతో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఏటీఎంల పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. ఏటీఎంలకు కాలం చెల్లే రోజులు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయనిపిస్తోంది. క్యాష్ లెస్ ఎకానమీ లక్ష్యంతో ఆన్ లైన్ ట్రాంజాక్షన్ల వైపు ప్రజలను మళ్లించడానికి ప్రభుత్వం ఏటీఎంల్లో డబ్బులు ఉంచకుండా చేస్తుందన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. నోట్ల రద్దు కష్టాలు పూర్తయినా కూడా గత 10 రోజులుగా ఏటీఎంల్లో ఎక్కడా డబ్బుల్లేక జనం మళ్లీ నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏటీఎంలకు కాలం చెల్లినట్లేనని భావిస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత విధించిన ఆంక్షలను ఆర్బీఐ సోమవారం నుంచి పూర్తిగా ఎత్తివేసినా నగదు మాత్రం దొరకడం లేదు. వారం వారం నగదు విత్‌ డ్రాయల్స్‌ పరిమితిని ఫిబ్రవరి 24 నుంచి పెంచింది.. రూ.24 వేల నుంచి రూ.50వేలకు పెంచింది. అలానే మార్చి 13 నుంచి ఎటీఎం లలో నగదు విత్‌ డ్రాయల్స్‌ పై విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసినట్లు ఆర్‌ బీఐ వెల్లడించింది. ఫిబ్రవరి లో జరిగిన రిజర్వుబ్యాంకు ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ ఈ ప్రకటన చేశారు. జనవరి 30వ తేదీన రిజర్వుబ్యాంకు కరెంటు ఖాతాలపై ఉన్న విత్‌ డ్రాయల్స్‌ ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేసింది. క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్‌ లు - వోవర్‌ డ్రాఫ్టులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించింది. ఇలా ఆంక్షలన్నీ ఎత్తివేసినా కూడా అసలు నగదు విత్ డ్రా చేసుకోడానికి ప్రైమరీ సోర్సయిన ఏటీఎంల్లో మాత్రం డబ్బులుంచడం లేదు.

కేంద్రప్రభుత్వం నవంబర్‌ 8వ తేదీన రూ.1,000 - రూ.500 నోటును అధికారికంగా చలామణి నుంచి రద్దు చేసిన తర్వాత నగదు విత్‌ డ్రాయల్స్‌ పై పరిమితులు విధించింది. ప్రారంభంలో ఎటీఎంలలో రూ. 2,500 వరకు విత్‌ డ్రాయల్స్‌ కు అనుమతించింది. అటు తర్వాత నుంచి దీన్ని రూ.4,500కు పెంచింది. కాగా జనవరి నుంచి ఆర్‌ బీఐ ఎటీఎం విత్‌ డ్రాయల్స్‌ పరిమితిని వారానికి రెట్టింపు రూ.10,000కు పెంచేసింది. అలానే కరెంటు ఖాతా విత్‌ డ్రాయల్స్‌ పరిమితిని రూ.1 లక్షకు పెంచింది. కాగా నవంబర్‌ లో వారం వారం బ్యాంకు ఖాతాల నుంచి విత్‌ డ్రాయల్స్‌ ను రూ.20వేల నుంచి రూ.24వేలకు పెంచింది. ఇక నుంచి నగదు విత్‌ డ్రాయల్స్‌ పై ఉన్న ఆంక్షలు పూర్తిగా తొలగిపోయినట్లే.. అని రిజర్వుబ్యాంకు చెబుతున్నా వాస్తవంగా చూస్తే ఎటీఎంలలో డబ్బు అస్సలేదు. ఆర్‌ బీఐ నగదు విత్‌ డ్రాయల్స్‌ పై ఆంక్షలు పూర్తిగా తొలగించినట్లు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్‌ లాంటి నగరా ల్లోనే ఎటీఎంలలో డబ్బు ల్లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల మొదటి తేదీ నుంచి ఇదే సీన్‌ కొనసాగుతోంది. హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరంలోనే పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఆర్‌బీఐ నగదు విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నుంచి పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేదో చూడాల్సిందే. మొత్తం రూ.12 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందని ఆర్థిక మంత్రి జైట్లీ చెబుతున్నారు. అలాంటప్పుడు నగదు కొరత ఎందుకొస్తున్నట్లు. దీనర్థం కేవలం ఏటీఎంలకు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడమేనని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/