Begin typing your search above and press return to search.

'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది'.. పర్ ఫెక్టు అర్థమిచ్చే వీడియో

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:53 AM GMT
ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది.. పర్ ఫెక్టు అర్థమిచ్చే వీడియో
X
వందల మాటలకు సమాధానం ఒక్క ఫోటో అని చెప్పవచ్చు. అలాంటిది కోటి మాటలు చెప్పనక్కర్లేదు.. ఒక చిన్న వీడియో ఇచ్చే సందేశం.. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. వ్యాపారంలో తలమునకలై ఉండి కూడా.. ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోలతో అందరిలో ఆసక్తిని పెంచేలా ఆయన పోస్టులు ఉంటాయి. విషయాల్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేసే ఆయన పోస్టులు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని ఇట్టే ఆకట్టుకునేలా చేస్తుంటాయి.

తాజాగా అలాంటి చిట్టి వీడియోను పోస్టు చేశారు ఆనంద్ మహీంద్రా. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. ప్రకృతిలో మనం ఒక భాగమే తప్పించి.. ప్రకృతి అంతా మనమే కాదన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదంటే.. భారీ చెట్లు ఉన్న చోట.. నలుగురు కలిసి ఆధునిక కటింగ్ బ్లేయర్ తో పొడవైన ఒక చెట్టును నరికేస్తారు.

ఆ చెట్టు పడిపోవాల్సిన డైరెక్షన్ లో పడుతూనే భారీ ట్విస్టు చోటు చేసుకుంటుంది. చెట్టును కట్ చేసిన నలుగురిలో ఒక వ్యక్తి వైపు అనూహ్యంగా కదిలి.. ఆ చెట్టు నరికిన వ్యక్తిని ఎత్తి అవతలకు పడేస్తుంది. కనురెప్ప మూసి తెరిచే వ్యవధిలో చోటు చేసుకున్న ఈ సీన్ ను అర్థమయ్యేలా చెప్పటానికి చాలానే సమయం పడుతుంది.

కానీ.. వీడియోలో ఈ సీన్ రికార్డు కావటంతో.. చెట్లను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసే మనిషి తగిన మూల్యం చెల్లించటం ఖాయమన్న విషయాన్ని ఈ చిట్టి వీడియో చెప్పేసేలా ఉంది.

ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'మీరు చెట్టును నరికేస్తారేమో కానీ.. వాటిని కింద పడేయలేరు' అన్న క్యాప్షన్ తో ట్వీట్ చేశారు. ఈ పోస్టు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినోళ్లు పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు.

ప్రకృతికి కోపం వస్తే ఇలానే ఉంటుందన్న మాటలతో పాటు.. ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుందన్న వ్యాఖ్యల్ని తమ స్పందనగా తెలియజేశారు. కొందరు ధ్వంసమైన రోడ్ల ఫోటోల్ని షేర్ చేశారు. ఏమైనా ప్రకృతి సమతుల్యతను కాపాడేలా చేయాల్సిన బాధ్యత మన అందరి మీదా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్న సందేశం ఈ వీడియోను చూసినంతనే కలుగక మానదు.