Begin typing your search above and press return to search.

షాక్: తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని అంతలా ధ్వంసం

By:  Tupaki Desk   |   24 Jan 2020 10:54 AM GMT
షాక్: తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని అంతలా ధ్వంసం
X
తమిళుల అభిమానం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ప్రదర్శించే అభిమానాన్ని అస్సలు వంక పెట్టలేరు. నేతలు.. సెలబ్రిటీల మీద అభిమానమే ఇంతలా ఉంటే.. ద్రవిడ ఉద్యమనేత.. సంఘ సంస్కర్త పెరియార్ మీద తమిళులకు ఉండే ప్రేమాభిమానులు అంతా ఇంతా కావు. పెరియార్ ను ఉద్దేశించి ఎవరు రవ్వంత మాట అన్నా తట్టుకోలేరు. అంతటి ప్రాధాన్యం ఉండే పెరియార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వైనం వెలుగు చూసింది.

చెంగల్పేట్ జిల్లా కలియపట్టాయి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దాడి కారణంగా పెరియార్ విగ్రహం కుడి చేయి.. ముఖం దెబ్బ తిని ఉండటంపై గ్రామస్థులు షాక్ తిన్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంది. ఈ మధ్యనే పెరియార్ పై చేసిన విమర్శల విషయంలో రజనీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు.

1971లో సేలంలో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో దుస్తుల్లేని సీతారామ విగ్రహాలకు పాదరక్షల దండ వేశారని వ్యాఖ్యానించిన రజనీ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఈ ర్యాలీని అప్పట్లో ఛో రామస్వామి కూడా విమర్శించారని పేర్కొన్నారు. తుగ్లక్ పత్రిక వార్సికోత్సవంలో రజనీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఒక కొలిక్కి రాక ముందే..పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది.

పెరియార్ పై రజనీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ ఆయన ఇంటి ముందు నిరసనలు చేసినా ఆయన ఒప్పుకోలేదు. తాను చేసిన వ్యాఖ్యలకు తగ్గ క్లిప్పులు తన వద్ద ఉన్నాయని.. వాటి ఆధారంగానే తాను వ్యాఖ్యలు చేశానని... ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని రజనీ తేల్చి చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎటు పయనిస్తుందో అర్థం కావట్లేదంటున్నారు.