Begin typing your search above and press return to search.

జగన్‌ పై ఫాక్షనిస్టు పోటీ!?

By:  Tupaki Desk   |   16 Dec 2018 9:38 AM GMT
జగన్‌ పై ఫాక్షనిస్టు పోటీ!?
X
పెదవి దాటే ముందే మాటకి ఒద్దిక నేర్పాలి. పెదవి దాటక ముందే మాటకి అణకువ నేర్పాలి. పెదవి దాటక ముందే మాటకిమంచితనం రుచి చూపించాలి. ఇవన్నీ సామాన్యులు చేసినా చేయకపోయినా ప్రజల మధ్య ఉన్న వాళ్లు మాత్రం నూటికి నూరు శాతం పాటించాలి. అలా చేయకపోతే పూలు జల్లిన ప్రజలే రాళ్లూ విసురుతారు. ఇది గతంలో అనేక మందికి అనుభవమే. భవిష్యత్‌ లో మరికొందరికి అనుభవంలోకి రానుంది. ఇదంతా ఏమిటీ అనుకుంటున్నారా... ఇదంతా ఎవరి గురించి అని ఆలోచనలో పడ్డారా.. ఇంకెవరి గురించో అయితే ఇంతెందుకు. పవర్ స్టార్‌ నంటూ ప్రజల మధ్యకు వచ్చి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతానంటూ గొప్పలు పోతున్న జనసేనాని పవన్ కల్యాణ్ గురించే. ఇటీవలే రాయలసీమలో పర్యటించిన పవన్ కల్యాణ్ సీమ ప్రజలు ఫ్యాక్షనిజం వదిలేయాలని - ప్రేమను పంచాలని గిరీశం టైపు లెక్చర్లు దంచారు. అంటే ఇన్నాళ్లూ రాయలసీమ ప్రజలు ఎక్కడా ప్రేమను పంచలేదా అని కొందరు ఈపాటికే నిలదీస్తున్నారనుకోండి. సినీ పరిశ్రమ కూడా ఇలాంటి మాటలు... తెరపై ఇలాంటి డైలాగులు పండించే సీమ ప్రజలకు దూరమైంది. ఇంత జరిగినా పవన్ కల్యాణ్ మాత్రం పాత పాట పాడరా పాచి పళ్ల పవనూ అన్నట్లే వ్యవహరిస్తున్నారు.

సరే, అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసే పులివెందుల నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాయలసీమలో ఫ్యాక్షనిస్టుగా పేరున్న పేర్ల పార్ధసారధి రెడ్డి. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత వై.ఎస్.రాజారెడ్డి హత్య కేసులో పార్థసారధి నిందితుడు. ఈ కేసులో పేర్ల కుటుంబానికి చెందిన పలువురు నిందితులుగా లేలారు. ఈ కేసులో మొత్తం 11 మందికి శిక్ష పడింది. అయితే కాలం కలిసి వచ్చి పార్ధసారధి రెడ్డికి శిక్ష పడలేదు. పార్థసారధి రెడ్డిలాగే మరో నిందితుతుడు ఎస్వీ సతీష్‌ రెడ్డి కేసులోంచి బయటపడి ఆనక టీడీపీ లీడర్‌ అయిపోయాడు!. ఈయన తెలుగుదేశం అభ్యర్ధిగా రాజశేఖర రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటి వరకూ పార్ధసారధి రెడ్డికి మాత్రం అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం జనసేన రూపంలో వచ్చిందంటున్నారు. ఈ పార్టీ తరఫున పులివెందుల నుంచి పార్ధసారధి రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైందంటున్నారు. ఫ్యాక్షన్ వద్దు అని - ప్రేమ ముద్దు అని బ్రహ్మానందం టైపు డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ దీనికి ఏమని సమాధానం చెబుతారో అని సీమ ప్రజలు అంటున్నారు.