Begin typing your search above and press return to search.

భద్రాచలం ఏపీదేనా? అందుకే కేసీఆర్ సవితి తల్లి ప్రేమ చూపిస్తారా?

By:  Tupaki Desk   |   20 July 2022 4:43 AM GMT
భద్రాచలం ఏపీదేనా? అందుకే కేసీఆర్ సవితి తల్లి ప్రేమ చూపిస్తారా?
X
కొత్త డౌట్ ను తెర మీదకు తీసుకొచ్చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. స్వతహాగా స్నేహపూర్వకంగా ఉంటారన్న పేరున్న పేర్ని నాని సీనియర్ నేత అన్న విషయం తెలిసిందే.

జగన్ ప్రభుత్వంలోని తొలి మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన.. తమ సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయటంలో ఆయన ప్రదర్శించిన ఆవేశం ఆయనకు కొత్త తరహా ఇమేజ్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. పవన్ మీద అవసరం ఉన్నా లేకున్నా విరుచుకుపడటం ద్వారా సీఎం జగన్ కంట్లో పడేందుకు తెగ కష్టపడే వారని చెబుతారు. దీని ఫలితమే.. మలిదశ మంత్రివర్గంలో తన పేరు ఉంటుందని భావించినా ఆయనకు మొండి చేయి తప్పలేదు.

మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఏదైనా అంశంపై మాట్లాడే విషయంలో తగ్గేదే లేదన్నఆయన తీరు ఉంటోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. పోలవరం డ్యామ్ కారణంగా భద్రాచలం మునిగిపోతుందనటం హాస్యస్పదంగా ఉందన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పలువురు మండిపడ్డారు. దీనిపై తాజాగా స్పందించిన పేర్ని నాని.. మిగిలిన వారికి భిన్నంగా.. తనకున్న సీనియార్టీతో గతానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1986లో పోలవరం లేదని.. అప్పుడు భద్రాచలం మునగలేదా? అని ప్రశ్నించిన పేర్ని నాని.. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారో? అని ప్రశ్నించారు. అంతేకాదు. మంథని.. ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగాయని.. ఆ ప్రాంతాల్ని ఎక్కడ కలుపుతారు? అని క్వశ్చన్ చేశారు. అంతేకాదు.. మరో కీలకమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

1953లో అంటే.. ఇప్పటి తెలంగాణ అప్పటి హైదరాబాద్ స్టేట్ ఏపీలో కలిసిపోయే నాటికి.. భద్రాచలం ఏపీలోనే ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సవితి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. తన వ్యాఖ్యలకు నిదర్శనంగా బలమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. యాదాద్రిని నిర్మించినట్లే భద్రాద్రిని ఎందుకు డెవలప్ చేయటం లేదు?అంటూ సూటి ప్రశ్నను అడిగేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలం మీద ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయాలని.. తాము డెవలప్ చేసి చూపిస్తామన్నారు. పేర్ని నాని కారణంగా ఇప్పటివరకు ఏపీ ప్రజలకు పెద్దగా పట్టని భద్రాచలం.. ఎవరిదన్న విషయంపై క్లారిటీతో పాటు.. 1953 ముందు భద్రాచలం ఏపీలోనే ఉండేదన్న చారిత్రక సత్యాన్ని గుర్తు చేసినట్లైంది. మరి.. యాద్రాద్రికి ఇచ్చినంత ప్రాధాన్యత భద్రాద్రికి ఎందుకు ఇవ్వటం లేదన్న మాటకు సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.