Begin typing your search above and press return to search.

మంత్రి పేర్ని వ్యాఖ్య‌లతో జ‌న‌సేన డీలా ప‌డుతుందా?

By:  Tupaki Desk   |   8 Aug 2021 3:41 AM GMT
మంత్రి పేర్ని వ్యాఖ్య‌లతో జ‌న‌సేన డీలా ప‌డుతుందా?
X
తాజాగా వైసీపీ కీలక నాయ‌కుడు, మంత్రి పేర్ని నాని జ‌న‌సేన‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. కీల‌క‌మైన స‌మ‌యంలో.. పేర్ని.. ఉద్దేశపూర్వ‌కంగానే త‌మ‌ను టార్గెట్ చేస్తున్నారా? లేక నిజ‌మేనా? అనే సందేహాలు పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. ఏపీలోని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి.. కాషాయ కండ‌వా క‌ప్పుకొన్న వ్య‌క్తిని సీఎం చేయాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారంటూ..పేర్ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు నిస్పందేహంగా జ‌న‌సేన‌ను ఉద్దేశించే చేశార‌ని.. ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. పైగా పేర్ని ప‌రోక్షంగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేశార‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో ఏపీలోని పార్టీల‌ను ప‌రిశీలిస్తే.. ఒక్క ప‌వ‌న్ త‌ప్ప‌.. ఎవ‌రూ బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉండ‌డం లేదు. దాదాపు ఏడాది కింద‌టే.. ప‌వ‌న్ బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా మారారు. అనేక ఎన్నిక‌ల్లో(అటు తెలంగాణ‌, ఇటు ఏపీ) బీజేపీకి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు. ఏకంగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం కూడా చేసి పెట్టారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు బీజేపీ కండువా క‌ప్పుకొన్న నాయ‌కుడు అంటే.. ప‌వ‌న్ త‌ప్ప మ‌రెవ‌రూ కారు. అయితే.. ఈయ‌న‌ను బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్తిగా ప్ర‌క‌టించి.. త‌ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వానికి చెక్ పెట్టాల‌ని చూస్తోంద‌ని అంటున్నారంటే.. దీనివెనుక వ్యూహం ఉండి ఉంటుంద‌నే సందేహాలు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

నిజానికి ప‌వ‌న్.. బీజేపీతో చెలిమి చేస్తున్నా.. ఈ విష‌యంలో కొన్ని ప‌రిమితుల‌ను పాటిస్తున్నారు. అంటే.. మిత్ర ప‌క్షం అయినంత మాత్రాన తాను బీజేపీకి సంపూర్ణంగా స‌హ‌క‌రించే నాయ‌కుడిని కాదంటూ.. ఆయ‌న ఇటీవ‌ల కాలంలో మౌనంగా ఉంటూనే కొన్నిసంకేతాలు పంపుతున్నారు. రాష్ట్రంలో హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు బీజేపీ నేత‌ల‌తో క‌లిసి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. గోవ‌ధ నిషేధం విష‌యంలోను, క‌డ‌ప జిల్లాలో తెర‌మీదికి వ‌చ్చిన టిప్పు సుల్తాన్ విగ్ర‌హ వివాదం విష‌యంలోనూ ఆయ‌న జోక్యం చేసుకోలేదు.

అంటే..ఇలాంటి వాటికి మ‌ద్ద‌తు ఇవ్వడం ద్వారా మైనారిటీ వ‌ర్గాల‌ను దూరం చేసుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని.. భావిస్తున్న ప‌వ‌న్ ఆయా విష‌యాల్లో వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు. కానీ, ఇప్ప‌డు వైసీపీ ప‌వ‌న్‌ను పూర్తిగా బీజేపీ నేత‌గా అభివ‌ర్ణించేందుకు ప్ర‌య‌త్నించడ‌మే కాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ సీఎం అభ్య‌ర్తి ప‌వ‌నే అనేలా పేర్నితో వ్యాఖ్య‌లు చేయించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిద్వారా.. మైనార్టీ వ‌ర్గాల‌ను సంపూర్ణంగా ప‌వ‌న్‌కు దూరం చేయ‌డంతోపాటు.. ప‌వ‌న్ త‌న‌కు సొంత బ‌లం చాల‌క‌నే..త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతోనే బీజేపీతో చెలిమి చేస్తున్నార‌నే వాదాన్ని తీసుకువెళ్తోంద‌ని అంటున్నారు.

ఈ ప‌రిణామం.. బీజేపీ కంటే.. కూడా ప‌వ‌న్‌కు భారీ డ్యామేజీ చేస్తుంద‌ని.. ఇదేఇప్పుడు వైసీపీకి కూడా కావాల్సిన కీల‌క ప‌రిణామ‌మ‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా ఉంటే.. అది టీడీపీ మాత్ర‌మే అయి ఉంటే స‌రిపోతుంద‌ని పాల‌క ప‌క్షం భావిస్తోంది. అదేస‌మయంలో ఒక‌టి రెండు ప్ర‌త్య‌ర్థి పార్టీలు పుట్టుకువ‌స్తే.. ఓట్లు చీలి వైసీపీకి ఇబ్బందులు రావ‌డం త‌థ్యం. ఈ నేప‌థ్యంలోనే వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన‌ను డిఫెన్స్‌లో ప‌డేయ‌డం ద్వారా.. వైసీపీ త‌న మార్గాన్ని సుగ‌మం చేసుకుంటోంద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌ల‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.