Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్, రబ్బర్ సింగ్.. పీకేపై పేర్ని ఫైరింగ్

By:  Tupaki Desk   |   12 Nov 2019 3:40 PM GMT
గబ్బర్ సింగ్, రబ్బర్ సింగ్.. పీకేపై పేర్ని ఫైరింగ్
X
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమ బోధన కాస్తా... వ్యక్తిగత దూషణల దాకా వెళ్లిపోయింది. పేదింటి పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమ బోధనను చేరువ చేసేందుకు జగన్ సర్కారు... అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై దాదాపుగా వైసీపీ మినహా అన్ని పార్టీలు నిరసన గళం అందుకున్నాయి. ఈ క్రమంలో తన వాదనను వినిపించే క్రమంలో సీఎం హోదాలో జగన్... నిరసన గళం విప్పిన వారి పిల్లలు ఏ మాద్యమంలో చదివారంటూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ మూడు పెళ్లళ్లను జగన్ మరోమారు ప్రస్తావించారు. అంతే... అగ్గి రాజుకుంది. పవన్ స్పందించారు. జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిగా ఇప్పుడు బంతి మళ్లీ వైసీపీి కోర్టులోకి వచ్చేసింది. జగన్ తరఫున జగన్ కేబినెట్ కీలక మంత్రిగా ఉన్న పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని దిగిపోయారు. పవన్ ను ఓ రేంజిలో విమర్శించారు. తనదైన శైలి పవర్ ఫుల్ పంచ్ లతో పేర్ని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.

అసలు కులగజ్జి అంటుకున్నది ఎవరికి? అంటూ పేర్ని నాని మొదలెట్టి.. దానిని ఎక్కడికో తీసుకెళ్లిపోయారనే చెప్పాలి. చంద్రబాబుకు మద్దతుగానే పవన్ వ్యవహారం నడుపుతున్నారన్న సంచలన ఆరోపణను సంధించిన నాని... పవన్ పేరుకు చంద్రబాబు నాయుడి పేరులోని నాయుడు పదాన్ని తగిలించేసి పవన్ నాయుడు అని సంబోధించారు. కులాల పట్టింపు లేదని నిత్యం చెప్పుకునే పవన్ నాయుడికే కుల గజ్జి అంటుకుందని, ఏపీలో కులగజ్జికి పదును పెట్టిందే పవన్ అని విమర్శించారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్... ఇన్నేళ్లలో ఒక్కసారి అయినా చంద్రబాబును ప్రశ్నించారా? అని కూడా సూటిగా ఎధురు దాడికి దిగిపోయారు. విపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా... జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా సాగుతున్న పవన్ ఉద్దేశమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పింది పట్టుకుని పవన్ రోడ్ల మీదకు వస్తున్నారని కూడా నాని ఆరోపించారు.

పవన్ స్టామినా ఏమిటన్న విషయాన్ని కూడా ప్రస్తావించేసిన నాని... సినిమాల్లో గబ్బర్ సింగ్ పేరు తెచ్చుకున్న పవన్... రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ గా మారిపోయారని సెటైర్లు వేశారు. పవన్ కు కేవలం చంద్రబాబు చెప్పింది మాత్రమే వినిపిస్తుందా? అని కూడా పేర్ని పంచ్ డైలాగ్ సంధించారు. పవన్ భాషా, వేషం చంద్రబాబు కోసమేనని కూడా నాని ఆరోపించారు. తమ సర్కారు లక్ష ఉద్యోగాలిచ్చిన విషయం పవన్ కు కనిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ను నానా దుర్భాషలాడిన పవన్ కు ఆయన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా అని కూడా నాని ప్రశ్నించారు. జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో జనానికి తెలుసని, అసలు ఆ కేసులు ఎలా నమోదయ్యాయో పక్కనే కూర్చున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పలేదా? అని కూడా నాని ప్రశ్నించారు.

ఆ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలను నేరుగానే ప్రస్తావించిన నాని... పవన్ ఒక్కసారి తాట తీస్తే... జనం పవన్ కు పదిసార్లు తాట తీస్తారని ధ్వజమెత్తారు. పెళ్లిళ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే... ప్రజా సేవపై మక్కువ ఉన్న జగన్ ఏపీకి సీఎం అయ్యారని నాని పేర్కొన్నారు. పవన్ కు నరనరాల కుల భావన జీర్ణించుకుపోయిందని పేర్ని మరో ఘాటు వ్యాఖ్య చేశారు. జగన్ ను విమర్శించడానికి పవన్ ఎవరో సినిమా రైటర్ కావాల్సి వచ్చిందన్న నాని... పవన్ థౌజండ్ వాలా పేలిస్తే... తాము ఫైవ్ థౌజండ్ వాలా పేలుస్తామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ను మ్యాన్ ఫ్రైడే అంటే... తాము పవన్ ను మ్యాన్ త్రీ వుమెన్ అంటామని కూడా నాని తనదైన శైలి కామెంట్ చేశారు. పవన్ అరుపులు, కేకలు కేవలం సినిమాల వరకేనని, ఆ విషయం తమకే కాకుండా అందరికీ తెలిసిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడిని పవన్ తిట్టినన్ని తిట్లు మరే నేత కూడా తిట్టి ఉండరని పవన్ ను నాని కాస్తంత గట్టిగానే తగులుకున్నారు.