Begin typing your search above and press return to search.

మెట్టూ గట్టూ దిగితే తట్టుకోలేవు...మూసుకుంటావ్

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:23 AM GMT
మెట్టూ గట్టూ దిగితే తట్టుకోలేవు...మూసుకుంటావ్
X
రాష్ట్రంలో కులాలు ప్రాంతాలు అన్నీ కూడా రాజకీయాలలోకి వచ్చేస్తున్నాయి. దేనిని అయినా పట్టుకుని రాజకీయాన్ని ఈదేయాలన్న ఆలోచనతోనే నేతలు ఉన్నారు. పార్టీల అధినేతలూ ఉన్నారు. విషయానికి వస్తే జనసేనాని వైసీపీలోని కాపు ఎమ్మెల్యేల మీద చేసిన ఘాటైన కామెంట్స్ కి మాజీ మంత్రి పేర్ని నాని రివర్స్ అటాక్ చేశారు. దత్తపుత్రుడా.. సన్నాసిన్నర సన్నాసి అంటూ మొదలెట్టి మేము కనుక నీలా మెట్టు గట్టూ దిగి సంస్కారం మరచి అనుచితంగా మాట్లాడితే అసలు తట్టుకోలేవు రెండు చెవులూ మూసుకోవాల్సిందే అంటూ గట్టిగానే కౌంటరేశారు.

మమ్మల్స్ని సన్నాసులు అంటావా నీవే సన్నాసిన్నర సన్నాసివి అంటూ విమర్శించారు. నీవు మాకు చెప్పులు చూపిస్తావా.. నీకు ఒక్కటే చెప్పు ఉంది కాబోలు. మాకు రెండున్నాయి. నీకే బజారు భాష వచ్చా, మా పార్టీ వాళ్ళు కూడా అదే భాష మాట్లాడితే నీవు ఏమైపోతావో ఆలోచించుకో అంటూ పేర్ని నాని పవన్ ని ఉద్దేశించి ప్రతి విమర్శలు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని విలువలు ఉండాలని మరీ ఇంతలా దిగజారుడుతనం పనికి రాదంటూ పవన్ కి హితవు పలికారు. అసలు రాజకీయాల్లో కులాల ప్రస్థావన ఎందుకు సామీ అని నిలదీశారు. ప్రజలు అని మాట్లాడాల్సిన చోట కులాల ప్రస్థావన తేవడమేంటి అని మండిపడ్డారు. చంద్రబాబు గెలుపు కోసం అహరహం తపించే పవన్ మాకు నీతులు చెప్పడమేంటి అని మండిపడ్డారు.

అసలు ప్యాకేజీ స్టార్ అని అంటే దారుణంగా విమర్శలు చేస్తున్న పవన్ నిజంగా కనుక ఆ మాటకు పౌరుషం తెచ్చుకుంటే తాను 175 సీట్లకు తన పార్టీ అభ్యర్ధులను పోటీకి పెట్టాలని సవాల్ చేశారు. అపుడు మా పార్టీ వారు ఎవరు ప్యాకేజీ స్టార్ అని అన్నా వారందరి తరఫునా తాను క్షమాపణలు చెబుతాను అని పేర్ని నాని అన్నారు. అలా కనుక చేయకపోతే వందకు వంద శాతం ప్యాకేజీ స్టార్ అనాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

పార్టీ పెట్టి పోటీ చేయకుండా పక్క వారికి సాయం చేయడం బహుశా ప్రపంచ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటారని ఆయన అన్నారు. అలాగే రాజకీయంగా ఒక పార్టీ నడిపే అధినేత చెప్పులు చూపిస్తూ పచ్చిగా దిగజారి మాట్లాడడం కూడా బహుశా పవన్ తప్ప మరోకరు ఈ దేశంలో ఉండరని కూడా ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కి మాత్రమే పౌరుషం ఉండదని, అందరికీ ఉంటుందని, నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే అవతల వారు సహించే ప్రసక్తే ఉండదని గుర్తుంచుకోవాలని అన్నారు. సినిమా డైలాగులు నాలుగు వల్లించి జనాలను పోగేసుకుని రెచ్చిపోతే నాయకులు కాలేరని పేర్ని నాని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివాను అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఏ పుస్తకాలలో ఈ బూతులు చదివారని, ఏ పుస్తకాలలో చెప్పులు చూపించమని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

వంగవీటి రంగా గురించి చెప్పే పవన్ కళ్యాణ్ అప్పటికి ఇంకా చెడ్డీలు వేసుకునే స్థితిలో ఉండి ఉంటారని, ఆయన కంటే తాను తన పార్టనర్ కలసి 2014లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో దమనకాండకు గురి అయిన ముద్రగడ పద్మనాభం గురించి చెబితే బాగుంటుందని అన్నారు. ఆనాడు ముద్రగడను కోరి టీడీపీ పెద్దలు అనేక రకాలుగా పరాభవించినా పవన్ కిమ్మనలేకపోయారు ఎందుకని ఆయన నిలదీశారు. అన్ని వర్గాల ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెబుతూ పవన్ కళ్యాణ్ ఇకనైనా తన మాటలు చేష్టలు సరిచూసుకుని మాట్లాడాలని సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.