Begin typing your search above and press return to search.

పేర్నినాని పోలిక మహా ఛండాలంగా ఉందా?

By:  Tupaki Desk   |   28 Feb 2022 3:21 AM GMT
పేర్నినాని పోలిక మహా ఛండాలంగా ఉందా?
X
తెర మీద తప్పు జరుగుతుంటే చాలు.. వీరావేశంతో వచ్చి ప్రశ్నించేయటం ప్రతి ఒక్క సినిమాలోనూ చూస్తుంటాం. ఆ మాటకు వస్తే.. సినిమాలో హీరో ఉన్నదే అందుకు. అలాంటి ‘హీరో’లకు కొదవలేని టాలీవుడ్ కు కొత్త కష్టం వచ్చింది. రీల్ లైఫ్ లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిజాన్ని పండించే హీరోలు.. రియల్ లైఫ్ వచ్చేసరికి అసలుసిసలు జీరోలకు పర్యాయ పదంగా మారటం చూస్తున్నదే. రాజకీయ విరోధం తన హద్దులు దాటేసి.. వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయిన వేళ.. పవన్ కల్యాణ్ సినిమాలను టార్గెట్ చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఇలాంటి వాదనల్ని ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఇలాంటి మాటలన్ని పచ్చ మీడియా తప్పించి మరెవరి నోటా రాదని బల్లగుద్ది వాదిస్తుంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజం గురించి నాలుగు మాటలు చెప్పినంతనే.. ‘పచ్చ’ కళ్లుగా అభివర్ణించే పేర్ని నాని.. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే చాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

మీ ఇష్టానికి మీరు నచ్చినప్పుడు సినిమాలు విడుదల చేసుకొని.. మా మీద పడిపోవటమేనా? అంటూ ఆయన విరుచుకుపడటం వరకు ఓకే. కానీ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా ఫంక్షన్ రెండు రోజులు వాయిదా వేసుకున్నప్పుడు.. టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం నివేదిక కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. నాలుగు రోజులు సినిమా విడుదలను వాయిదా వేసుకోలేరా? అన్న మాటపై మాత్రం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మంచి మనిషి.. అది కూడా అధికారపక్షానికి చెందిన మంత్రి ఒకరు అనూహ్యంగా మరణించినప్పుడు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీతో అస్సలు పడని పవన్ కల్యాణ్.. తన సినిమా ఫంక్షన్ ను రెండు రోజులు వాయిదా వేసుకోవటం మామూలు విషయం కాదు.

కోట్లాది రూపాయిల వ్యాపారానికి జరిగే నష్టం గురించి ఆలోచించకుండా.. ఒక మంచి మనిషి కోసం.. నష్టం గురించి ఆలోచించకుండా.. వ్యాపారాన్ని సైతం పక్కన పెట్టేసిన పెద్ద మనసుకు వీలైతే మెచ్చుకోవాలి. లేదంటే.. మౌనంగా ఉండాలి.

అంతేకాదు.. గౌతమ్ రెడ్డి మరణం వేళ.. ఫంక్షన్ వాయిదా వేసుకున్నప్పుడు.. సీఎం జగన్ ముందుకు రావాల్సిన టికెట్ల ధరల నివేదిక కోసం సినిమా విడుదలను వాయిదా వేసుకుంటే ఏమవుతుందన్న ప్రశ్న.. దానికి సంబంధించిన పోలికను తెచ్చిన మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపాటు వ్యక్తమవుతోంది. సొంత పార్టీకి చెందిన సహచర మంత్రికి గౌరవార్ధం ప్రత్యర్థి తన ఫంక్షన్ ను వాయిదా వేసుకున్న తీరును పొగడాల్సిన అవసరం లేదు.

కానీ.. ఇలా మాట్లాడితేనే ఇబ్బంది అంతా. అది కూడా పేర్ని నానికి పోయేదేమీ లేదు. జగన్ సర్కారు ఇమేజ్ కే డ్యామేజ్ అంతా. ఆ విషయాన్ని సీఎం జగన్ గుర్తిస్తున్నారు. ఏమైనా.. పోలికలతో ఇష్యూల్ని పోల్చే వేళ.. కాస్తంత ఆచూతూచి అన్నట్లుగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. పేర్ని నాని మాష్టారికి ఇలాంటివి అర్థమవుతాయంటారా?