Begin typing your search above and press return to search.

జగన్... మెగాస్టార్ భేటీ వెనక ఆయన...?

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:55 PM GMT
జగన్... మెగాస్టార్ భేటీ వెనక ఆయన...?
X
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు హాట్ హాట్ టాపిక్ ఏంటి అంటే జగన్ మెగాస్టార్ భేటీయే. సడెన్ గా ఈ న్యూస్ రావడం, అంతే సడెన్ గా ఆ ఇద్దరూ భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. మీడియాకు సైతం ఉప్పు అందకుండా ఈ భేటీ సాగిపోయింది. దీంతో ఈ భేటీ తరువాత ఎన్నో ఊహాగానాలు చర్చలు సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ నటుడు మాత్రమే కాదు. ఆయన ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత. కేంద్రంలో మంత్రిగా  కొన్నాళ్ళు  పనిచేశారు. ఇక ఆయన తమ్ముడు పవన్ ఇపుడు  జనసేన అధినేతగా ఉన్నారు.

ఇక ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తే వైసీపీ వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా ఢీ కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి జగన్ తో భేటీ కావడం మీద ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. కొందరు అయితే వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఒంటరిగా చిరంజీవిని రమ్మనమని చెప్పి భారీ కుట్రకు దారి తీశారని అంటున్నారు. మరి వైపు చూస్తే మెగాస్టార్ చిరంజీవి అపాయింట్మెంట్  వెనక ఒకరు ఉన్నారని తనకు మాత్రమే తెలిసిన విషయాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీడియాకు చెబుతున్నారు.

ఇంతకీ జగన్ తో మెగాస్టార్ భేటీని ఏర్పాటు ఫేసింది సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి అని ఆయన చెబుతున్నారు. ఆయనే జగన్ కేసులను చూస్తున్న వ్యక్తిగత న్యాయవాది కూడా అని అంటున్నారు. గతంలో చిరంజీవి రెండు సార్లు జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయగా నాడు జగన్ నిరాకరించారు అన్న విషయాన్ని రాఘురామ బయటపెట్టారు.

అయితే ఈసారి నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగి ఈ అపాయింట్మెంట్ ని ఖరారు చేయడంతో జగన్ నో అనలేకపోయారు అని ఆయన పేర్కొన్నారు. సరే రఘురామ చెప్పింది బాగానే ఉన్నా మళ్ళీ మళ్లీ తనతో లంచ్ మీటింగుకు రావాలని జగన్ కోరారని మెగాస్టార్ మీడియా ముందు చెప్పుకున్నారు కదా. దీని కంటే ముందు గతంలో కూడా మెగాస్టార్ దంపతులకు జగన్ ఇంట్లో విందు ఇచ్చిన సంగతి కూడా ఉంది కదా.

మరి కేవలం బలవంతం మీదనే అపాయింట్మెంట్ జరిగితే జగన్ ఇంట్లో లంచ్ కి ఎలా ఇన్వైట్ చేస్తారు అన్న చర్చ కూడా వస్తోంది. అయితే ఇక్కడో విషయం ఉందని అంటున్నారు. మెగాస్టార్ తనకు జగన్ ఇంట్లో ఆతీధ్యం గురించి మీడియా ముందు చెప్పుకుని మురిసిపోయారు. దాంతో పాటు ఆయన్ని తన సోదరసమానుడు అనేశారు. ఇక ఈ విషయం రాజకీయంగా కలకలం రేపుతోంది. పైగా జనసేన ఏపీ పొలిటికల్ సీన్ లో ఉంది.

దాంతో మెగా ఇంపాక్ట్ ఇటు వైపు పడకుండా రఘురామ ఇలా చెబుతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. ఇక జగన్ గతంలో చిరంజీవికి అపాయింట్మెంట్ కి నో చెప్పారు అని చెప్పడం ద్వారా మెగాభిమానులలో జగన్ మీద ఉన్న పాజిటివిటీని దెబ్బ తీయడానికే ఇలా మాట్లాడుతున్నారా  అన్న మాట కూడా వినవస్తోంది. మొత్తానికి చూస్తే ఈ భేటీ ఏమో కానీ అటు నెగిటివ్ గా ఇటు పాజిటివ్ గా ఎవరికి తోచిన తీరున వారు వ్యాఖ్యానాలు చేయడమే విశేషం.