Begin typing your search above and press return to search.

అతడికి ఒకేసారి కరోనా.. మంకీపాక్స్.. హెచ్ఐవీ.. ఎంత అన్ లక్కీ ఫెలోనో?

By:  Tupaki Desk   |   26 Aug 2022 1:56 PM GMT
అతడికి ఒకేసారి కరోనా.. మంకీపాక్స్.. హెచ్ఐవీ.. ఎంత అన్ లక్కీ ఫెలోనో?
X
దురదృష్టవంతుడ్ని ఎవరూ మార్చలేరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం గురించి వింటే.. దురదృష్టం కూడా భయపడి పోయేలా ఉంటుందని చెప్పాలి. ఒక వ్యక్తికి ఇలాంటి దారుణ పరిస్థితి ఒకటి ఎదురవుతుందన్న భావన మనసుకు కలగదు. అలాంటిది అతడికి ఎదురైన ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తేనే.. వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది అతడు అవన్నీ అనుభవించటం కంటే నరకం ఇంకేం ఉంటుంది. తాజాగా ఒక వ్యక్తికి ఒకే సందర్భంలో కరోనా.. మంకీ పాక్స్.. హెచ్ఐవీ సోకిన వైనాన్ని గుర్తించారు. ఈ పేషెంట్ కు సంబంధించిన ఈ ఉదంతం తాజాగా జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లో ప్రచురితమైంది.

ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో ఈ మూడు తీవ్ర వ్యాధులు విరుచుకుపడిన వైనం వింటేనే వణుకు పుట్టేస్తుందని చెప్పాలి. తాజా సంచికలో ప్రచురితమైన ఈ పేషెంట్ కేసు వివరాల్ని వెల్లడించారు.

ఇటలీకి చెందిన ఒక వ్యక్తి ఐదు రోజుల పాటు స్పెయిన్ టూర్ కు వెళ్లారు. తిరిగి వచ్చిన తొమ్మిది రోజులకు ఆ వ్యక్తికి జ్వరం.. గొంతునొప్పి.. తలనొప్పి.. తొడ దగ్గర ప్రాంతంలో వాపు కనిపించాయి. దీంతో.. అతగాడు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది.

అనంతరం అతడి శరీరంపై దద్దుర్లు.. పొక్కులు రావటం మొదలయ్యాయి. దీంతో మరింత కంగారుకు గురైన సదరు వ్యక్తి ఆసుపత్రికి వెళ్లి వైద్యుల్ని సంప్రదించగా.. అతడ్ని పరీక్షించిన వైద్యులు అతనికి మంకీపాక్స్ సోకినట్లుగా గుర్తించారు. దీంతో.. అతడ్ని ప్రత్యేక చికిత్సా విభాగానికి తరలించారు. ఈ సందర్భంగా అతడి కాలేయంలోని మార్పుల్ని గమనించారు. దీంతో.. అతడికి పరీక్షలు జరపగా.. మంకీపాక్స్ సోకినట్లుగా తేల్చారు.

ఇవన్ని సరిపోనట్లు.. అతగాడికి హెచ్ఐవీ పాజిటివ్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. జీనోమ్ సీక్వెన్స్ లో అతడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 5.1 బారిన పడినట్లుగా గుర్తించారు. ఈ వ్యక్తి కరోనా టీకా రెండుసార్లు వేయించుకున్నట్లు గుర్తించారు.

దీంతో.. అతడికి ప్రత్యేక చికిత్సను జరపగా.. వారం వ్యవధిలో కరోనా.. మంకీ పాక్స్ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక.. హెచ్ఐవీ విషయంలో మాత్రం చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒకేసారి ఒకే వ్యక్తికి ఇలా మూడు భిన్నమైన వైరస్ లు సోకిన కేసు ఇదేనని చెబుతున్నారు.