Begin typing your search above and press return to search.

పెటా రాజకీయ పార్టీ పెట్టబోతోందా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 2:21 PM GMT
పెటా రాజకీయ పార్టీ పెట్టబోతోందా?
X
ఎవరినైనా తప్పు పట్టండి. వెంటనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పు కాదని వివరిస్తారు. అదే రాజకీయ నాయకుడ్ని విమర్శించండి. వెనుకా ముందు ఆలోచించకుండా ప్రతి విమర్శ చేస్తారు. తప్పు పట్టిన వారి పట్ల వ్యవహరించాల్సిన వైఖరిని భిన్నంగా వ్యవహరిస్తోంది పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్). జల్లికట్టుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి.. దానిపై నిషేదం తేవటంలో సక్సెస్ అయ్యింది.

తమ సంప్రదాయమైన జల్లికట్టుపై కోర్టు నిషేధం విధించటంపై తమిళులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ సంప్రదాయంపై చేస్తున్న దాడిగా.. ప్రాశ్చాత్య దేశాల కుట్రగా మండిపడుతున్నారు. జల్లికట్టుపై విధించిన బ్యాన్ పై కోట్లాది మంది తమిళులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ..మెరీనా బీచ్ మొదలు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. జల్లికట్టు నిషేధానికి కారణమైన పెటా సంస్థను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు. జంతువుల్ని హింసించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. శాఖాహారాన్ని ప్రమోట్ చేసేలా చేసే ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు కొత్తతరహా రాజకీయాన్ని షురూ చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. జల్లికట్టును తీవ్రంగా విమర్శిస్తున్న నటుల్లో ఒకరైన సినీ హీరో సూర్యపై పెటా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన తాజా చిత్రమైన సింగం-3 విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కోసమే జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. దీనిపై హీరో సూర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెటా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆయన మరో ఏడు రోజుల్లో పెటా భేషరతు క్షమాపణలు చెప్పాలంటూ సూర్య లీగల్ నోటీస్ పంపారు.

జల్లికట్టుకు తమ క్లయింట్ గతంలోనూ మద్దతు ఇచ్చారని.. తమ క్లయింట్ ప్రముఖ నటుడు.. చట్టానికి బద్ధుడైన సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ.. పెటాకు లీగల్ నోటీసులు జారీ చేశారు. పెటా ఇండియా వ్యాఖ్యలు తమ క్లయింట్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయని.. వారంలో భేషరతు క్షమాపణలు చెప్పకుంటే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సూర్య తరఫు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. తాను నమ్మిన వాదనను వినిపించాల్సిన వేళ.. బ్యాలెన్స్ తప్పి సినీ నటులపై రాజకీయ తరహా విమర్శలు చేస్తున్న పెటా తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. స్వచ్చంద సంస్థగా వ్యవహరించే పెటా.. తాజా ఉదంతంలో కాస్త ఎక్కువ చేస్తుందన్న విమర్శల్ని మూటగట్టుకుంటుందన్నమాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/