Begin typing your search above and press return to search.

పేట బాబూరావుకు కోపం వచ్చింది...?

By:  Tupaki Desk   |   14 April 2022 9:09 AM GMT
పేట బాబూరావుకు కోపం వచ్చింది...?
X
ఆయన పాయకరావుపేటకు ఎమ్మెల్యే. ఒకటి రెండు కాదు మూడు సార్లు గెలిచి పేటకు నేనే రాజకీయ మేస్త్రీ అనేశారు. పూర్వాశ్రమంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన గొల్ల బాబూరావు నాటి కాంగ్రెస్ మంత్రి కొణతాల రామక్రిష్ణ ప్రోత్సాహంతో పాటు, వైఎస్సార్ చలవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఫస్ట్ ప్రయత్నంలోనే ఆయన పాయకరావుపేట నుంచి ఎమ్మెంల్యేగా 2009లో గెలిచారు. పాయకరావుపేట అప్పటిదాకా టీడీపీకి కంచుకోట.

అలాంటి సీటుని గెలుచుకుని బాబురావు గ్రేట్ అనిపించుకున్నారు. ఇక వైఎస్సార్ మరణంతో ఆయన జగన్ వైపునకు వచ్చేశారు. తృణప్రాయంగా కాంగ్రెస్ కి రాజీనామా చేసి జగన్ పార్టీ తరఫున 2012 ఎన్నికల్లో గెలిచి వచ్చారు. ఇక 2019లో మూడవసారి గెలిచారు. ఆ విధంగా సీనియర్ మోస్ట్ నేతగా అనకాపల్లి జిల్లాలో ఉన్న తనను కాదని మంత్రి పదవి జూనియర్లకు ఇచ్చేశారని ఆయన మండిపోతున్నారు.

తన మందీ మార్బలాన్ని తీసుకుని ఆయన ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి వద్దకు వెళ్ళి మరీ విషయం చెప్పేశారు. తన బాధను కూడా చెప్పుకున్నారు. జూనియర్లకు పదవులు, సీనియర్లు చేసిన‌ సేవలు, త్యాగాలకు అర్ధం లేదా అని కూడా వాపోయారు. ఇక పాయకరావుపేటకు చెందిన వైసీపీ క్యాడర్ కూడా తమ నేతకు తీరని అన్యాయం జరిగింది అని అంటున్నారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడిగా, మాజీ ప్రభుత్వ అధికారిగా సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా అర్హుడిగా ఉన్న తనకు కాకుండా మినిస్టర్ కుర్చీ వేరొకరికి పోవడం పట్ల బాబూరావు గుస్సా అవుతున్నారు. తాను పార్టీ పట్ల ఎంత విధేయత చూపినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అని కూడా ఆయన అంటున్నారు.

తాను ఇక మీదట క్యాడర్ కోసం నిలబడతాను అని మెత్తగా మెతకగా ఉండనని కూడా బాబూరావు అంటున్నారు అంటే ఒక విధంగా హై కమాండ్ మీద ఆయన యుద్ధం ప్రకటించారు అనుకోవాల్సిదే. తనలో ఇప్పటిదాకా మంచి తనాన్నే చూశారని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అధినాయకుడు జగన్ సైతం తన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పాయకరావుపేటకు చెందిన బాబూరావు కోపాన్ని ఎలా చల్లార్చాలో హై కమాండ్ కి పాలుపోవడం లేదు. న్యాయంగా ఆయనకు పదవులు ఇవ్వాలి. కానీ ఎక్కడో ఈక్వేషన్స్ తప్పాయి. మరి బాబూరావు ఇదే తనకు లాస్ట్ చాన్స్ అన్నంతగా ట్రై చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు అంటున్నారు. దాత్నో పేట వైసీపీలో అగ్గి రాజుకుంది.