Begin typing your search above and press return to search.

జంపింగ్ మంత్రులకు కోర్టు షాకిస్తుందా?

By:  Tupaki Desk   |   11 July 2017 6:09 AM GMT
జంపింగ్ మంత్రులకు కోర్టు షాకిస్తుందా?
X
వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసి మంత్రి పదవులు పొందిన నలుగురు నేతల వ్యవహారం కోర్టుకు చేరింది. ఫిరాయింపు మంత్రులు భూమా అఖిలప్రియ - ఆదినారాయణరెడ్డి - సుజయ్‌ కృష్ణరంగారావు - అమర్‌ నాథ్‌ రెడ్డిపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తంగెళ్ల శివప్రసాద్‌ అనే జర్నలిస్ట్‌ వీరికి వ్యతిరేకంగా పిల్‌ దాఖలు చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన నలుగురు వ్యక్తులు ఏ అర్హతతో మంత్రి పదవులు చేపట్టారో ప్రశ్నించాలని హైకోర్టును కోరారాయన.

ఇందులో ప్రతివాదులుగా నలుగురు ఫిరాయింపు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరును చేర్చారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తులను అనర్హులుగా చేయాలని రాజ్యాంగం చెబుతోంది… కానీ రాజ్యాంగాన్ని ఉల్లఘించిన వారే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారని పిటిషనర్ వివరించారు. రాజ్యాంగం ఒక వ్యక్తిని మంత్రిగా నియమించడాన్ని నిషేధించినప్పుడు ఆ వ్యక్తి మంత్రిగా ఎలా నియమితులవుతారని ప్రశ్నించారు.

గవర్నర్‌ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా పనిచేయాలని.. కానీ ఆయనే నలుగురి చేత ప్రమాణస్వీకారం చేయించారని అక్షేపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి చేసే సిఫార్సులను రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ పాటించాల్సిన అవసరం లేదని పిటిషనర్‌ వివరించారు. ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నా అది అమలు కావడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం నలుగురు మంత్రులకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదన్నారు. కాబట్టి తాను వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు తేలే వరకూ నలుగురు ఫిరాయింపుదారులు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించకుండా నిరోధించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.