Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తి నివేద‌న‌పై పిల్.. హైకోర్టు ఏం చెబుతుంది?

By:  Tupaki Desk   |   31 Aug 2018 5:23 AM GMT
ప్ర‌గ‌తి నివేద‌న‌పై పిల్.. హైకోర్టు ఏం చెబుతుంది?
X
నీవు నేర్పిన విద్యే నీర‌జాక్ష అన్న సామెత‌ను గుర్తుకు తెచ్చే ఉదంతం ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌తి విష‌యానికి కోర్టుకు వెళ్ల‌టం.. పోలీసులు ఫిర్యాదుల‌తో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందిన కేసీఆర్ వ్యూహాల‌కు త‌గ్గ‌ట్లే.. తాజాగా ఆయ‌న బాట‌లో న‌డిచే క్ర‌మం క‌నిపిస్తోంది. గ‌తంలో త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలకు త‌గ్గ‌ట్లుగా పావులు క‌దిపిన ఆయ‌న‌కు.. కేసీఆర్ స్టైల్లోనే చికాకు తెప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రగ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మ నాలుగున్న‌రేళ్ల పాల‌న గురించి గొప్ప‌లు చెప్పేందుకు వీలుగా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఇందుకోసం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రెవ‌ర్వ‌రూ ఏర్పాటు చేయ‌ని స్థాయిలో 25ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన‌ధికారిక స‌మాచారం ప్ర‌కారం ఈ స‌భ కోసం రూ.100 నుంచి రూ.125కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

వేలాది వాహ‌నాల్లో స‌భ‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇదిలా ఉంటే.. ఈ స‌భ‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ తాజాగా హైకోర్టులో ఒక ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. స‌భ‌కు అనుమ‌తులు ఇచ్చిన తీరును త‌ప్ప ప‌డుతూ.. అనుమ‌తుల్ని వెన‌క్కి తీసుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది.
జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాకు చెందిన న‌డిగ‌డ్డ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు పూజారి శ్రీ‌ధ‌ర్ ఈ పిల్ ను వేశారు. ఇందులో ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి.. డీజీపీ.. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ప్ర‌తివాదులుగా చేర్చారు.

స‌భ పేరుతో పాతిక లక్ష‌ల మందిని ఒక‌చోటుకు చేర్చి త‌మ హ‌యాంలో సాధించిన విజ‌యాల్ని చెప్పేందుకు మ‌రో మార్గాన్ని ఎంచుకోవ‌చ్చ‌ని.. ఆ తీరులో ఆదేశాలు జారీ చేయాల‌ని పిల్ లో పేర్కొన్నారు. ఈ కేసును అత్య‌వ‌స‌రంగా విచారించాల్సి ఉంద‌ని పేర్కొన‌టంతో ఈ రోజు (శుక్ర‌వారం) దీనిపై విచార‌ణ జ‌రిపేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. స‌భ కోసం 1600 ఎక‌రాల్ని చ‌దును చేస్తున్నార‌ని.. ఇందులోని చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

ఈ స‌భ కోసం ల‌క్ష వాహ‌నాల్ని సిద్ధం చేస్తున్నార‌ని.. దీని కార‌ణంగా రోడ్ల‌పై ప్ర‌జ‌లు తిరిగే ప‌రిస్థితి ఉంద‌డ‌ని.. ప్ర‌జా ర‌వాణా స్తంభించిపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ స‌భ కోసం రూ.200 కోట్ల ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ పిల్ పై హైకోర్టు విచార‌ణ‌కు ఓకే చెప్ప‌టంతో.. తుది నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది. ఈ వ్య‌వ‌హారం సీఎం కేసీఆర్ కు చికాకు పెట్టిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.