Begin typing your search above and press return to search.

ఎలక్షన్ ముగిశాయి మళ్లీ పెట్రోల్ , డీజల్ రేట్స్ బాదుడు !

By:  Tupaki Desk   |   6 May 2021 4:35 AM GMT
ఎలక్షన్ ముగిశాయి మళ్లీ పెట్రోల్ , డీజల్ రేట్స్ బాదుడు !
X
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లకి మళ్లీ రెక్కలొస్తున్నాయి. అలా ఎన్నికల కౌంటింగ్ ముగిసిందో లేదో మరుసటి రోజు నుండే ఇంధన ధరల పెరుగుదల కూడా ప్రారంభం అయ్యింది. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు లబోదిబోమంటున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 24వ తేదీన లీటర్‌ పెట్రోల్‌ పై 14, డీజీల్‌ పై 13 పైసలు పెరిగింది. ఆ తరువాత నుంచి పెట్రోల్, డీజీల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ,ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి. నిన్న లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, ఇవాళ మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున పెరిగింది.

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పెట్రోల్ ధరల్ని పెంచకుండా ఉన్న ప్రభుత్వం , ఒక్కసారి ఫలితాలు వెల్లడికావడం తో మళ్లీ బాదుడు షురూ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు, పలువురు రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. కరోనా సమయంలో ఓ వైపు సామాన్యులు నలిగిపోతుంటే, దాన్ని పట్టించుకోకుండా మళ్లీ వారిపై అదనపు భారం మోపుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే ఎన్డీయే సర్కార్ లక్ష్యం ఏమిటో కూడా మరోసారి బట్టబయలైంది. కేవలం ఎన్నికలు ఉన్న సమయంలో మాత్రమే ఆఫర్లు , హామీలు ఇచ్చి , ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే మళ్లీ షరామామూలే. దీనితో ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజల పై ఉండేది తల్లి ప్రేమ కాదు సవతి ప్రేమ అని సామాన్యులు మండిపడుతున్నారు. పెట్రోల్ , డీజల్ ధరలు ఎన్నికల సమయంలోనే ఎందుకు పెరగలేదు , ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత వరుసగా మూడు రోజులు ఎందుకు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్, ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటున్నాయి. అయితే, తాజాగా ఎన్నికలు ముగియడం.. చమురు ధరలు మళ్లీ పెరగడం చూస్తుంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రాల్లో ఆందోళన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏర్పాటైన తరువాత ఎక్సైజ్‌ సుంకం గత 6 సంవత్సరాలలో 15 సార్లు సవరించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పడు పెంచాలి, తగ్గినప్పుడు తగ్గించాలి అనే విధానానికి తూట్లు పొడిస్తూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు పెంచుతూ, తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా ఎక్సైజ్‌ డ్యూటీని పెంచివేస్తూ ప్రజలపై విపరీతమైన భారం మోపుతూ వస్తోంది. బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచడం ద్వారా సుమారు రూ. 11 లక్షల కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ రోజు ఇంధన ధరల్ని ఒకసారి పరిశీలిస్తే .. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి. ఇక బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62కు చేరాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.